రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.విజన్-2047 అమలు, ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవాలని సీఎం చంద్రబాబు తపిస్తున్నారని వివరించారు. దావోస్ లో గడ్డకట్టించే చలిలో కూడా చంద్రబాబు ప్రతి టెంటుకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించారని వర్ల రామయ్య వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలోనూ దావోస్ వెళ్లారని, నాడు జగన్ చేసింది విహార యాత్ర అయితే, నేడు చంద్రబాబు చేసింది ప్రజాయాత్ర అని ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులకు బిల్ గేట్స్ హామీ ఇవ్వడం విజన్-2047 విజయానికి సంకేతం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే చంద్రబాబు, లోకేశ్ దావోస్ వెళ్లారని వర్ల రామయ్య స్పష్టం చేశారు.జగన్ పాలన అంతా అవినీతిమయం అని, అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. జగన్ రాష్ట్రానికి మేలు చేయకపోగా, సీఎం చంద్రబాబు పర్యటనను ప్రశ్నించడం తప్పు అని మండిపడ్డారు.