ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే మన పోరాటం: సుష్మా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 03:07 PM

అరబ్‌ దేశాల ప్రతిష్ఠాత్మక ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) సదస్సుకు విశిష్ట అతిథిగా భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఉగ్రవాదం అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోందని, దేశాలను నాశనం చేస్తోందని అన్నారు. 1.3బిలియన్ల భారతీయుల అభినందనలు, ప్రత్యేకంగా 185మిలియన్ల ముస్లిం సోదరసోదరీమణుల శుభాకాంక్షలు ఇక్కడికి తీసుకొచ్చానని ఆమె తెలిపారు. ‘శాంతికి దారి చూపే మార్గంగా భారత్‌ ఉంది. మా దేశంలో ఎన్నో మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోని భిన్నమైన దేశాల్లో భారత్‌ ఒకటి. అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఎంతో సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారు. ఎలా కలిసి ఉండాలో భారత్‌ ప్రజలకు తెలుసు’ అని ఆమె అన్నారు.


ఉగ్రవాదం పెట్రేగిపోతోందని, దాన్ని నిలువరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని సుష్మ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం కారణంగా ఎన్నో దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే పోరాటానికి భారత్‌ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ‘ఉగ్రవాదం అంతకంతకూ పెరుగుతోంది. వాళ్లు చేస్తున్న దారుణాల వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు.. వెంటనే దాన్ని నిలిపివేయాలి. మనందరం కలిసి కట్టుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. తీవ్రవాదం పేరుతో మతాన్ని వక్రీకరిస్తున్నారు. మన పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండాలి.. మతానికి వ్యతిరేకంగా కాదు. ఇస్లాం ధర్మం శాంతి. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఎందులోనూ హింస అర్థం లేదు. అలాగే ప్రతి మతంలో శాంతి, కరుణ, సోదరభావం ఉన్నాయి. భారత్‌ ఎల్లప్పుడూ బహుళత్వాన్ని అనుసరిస్తుంది. రుగ్వేదం ప్రకారం దేవుడు ఒక్కడే కానీ ఆయన్ను ప్రజలు రకరకాలుగా పూజిస్తారు’ అని సుష్మ పేర్కొన్నారు.


మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అక్కడ ప్రతి ప్రార్థనా శాంతి అనే పదం ఉచ్ఛరించిన తర్వాతే ముగుస్తుంది. స్థిరత్వం, శాంతి, సామరస్యం, ఆర్థిక పురోగతి, ప్రజల అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మా తరఫు నుంచి మీకు అభినందనలు. అందుకు మా నుంచి సంపూర్ణ మద్దతు మీకు ఇస్తున్నాం’ అని ఆమె తెలిపారు. ‘మానవత్వాన్ని కాపాడాలనుకుంటే.. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం నిలిపివేయాలి. యుద్ధం, ఇంటెలిజెన్స్‌ ద్వారా ఉగ్రవాదంపై మనం విజయం సాధించలేము’ అని ఆమె పునరుద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa