ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రేపు పాల్గొనే భక్తులకు ఉత్తర ప్రదేశ్ సర్కారు సలహాలు, సూచనలు అందజేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రోజుకు కోటి మందికి పైగా భక్తులు హాజరు అవుతున్నారు. దేశ ప్రజలే కాకుండా విదేశాలకు చెందిన వాళ్లు సైతం ఇక్కడకు వస్తూ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయతే రేపే మౌని అమావాస్య కావడంతో.. మరింత ఎక్కువ మంది ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. ఈ విషయం గుర్తించిన యూపీ సర్కారు భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా రేపు ఒక్కరోజే 10 కోట్ల మంది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించబోతుండగా.. వారందరూ పాటించాల్సిన నియమాల గురించి పలు సూచనలు చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఉత్తర ప్రదేశ్ ససర్కారు జారీ చేసిన అడ్వైజరీలో.. నిర్దేశించిన మార్గాల ద్వారానే ఘాట్‌ల వద్దకు చేరుకోవాలని తెలిపింది. స్నానం చేసిన వెంటనే బయటకు వచ్చి పార్కింగ్ ప్రదేశాలు లేదా బస చేసే ప్రాంతాల వద్దకు వెళ్లాలని వివరించింది. బారికేడ్ల, పాంటూన్ బ్రిడ్జిలపై భక్తులు నిదానంగా నడవాలని సూచించింది. భక్తులు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే స్థానికంగా ఏర్పాటు చేసిన సెక్టార్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా సంగమం వద్ద ఉన్న ఘాట్‌లన్నీ పవిత్రమైనవేనని.. ముందుగా ఏ ఘాట్‌కు వెళ్తే అక్కడే స్నానం చేయడం మంచిదని వివరించింది.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని... సౌకర్యాలు, ఏర్పాట్లు గురించి చేసే అసత్య ప్రచారాలను కొట్టి పారేయాలని పేర్కొంది. రోడ్ల మీద గుంపులుగా నిల్చొని ఇతర భక్తులకు ఆటంకాలు కల్గించకూడదని.. ఆలయాల్లో దర్శనాలకు హడావుడిగా పరుగలు పెట్టొద్దని తెలిపింది. దాని వల్ల ఆయాసం, ఆందోళన రావడం తప్ప మరేమీ జరగదని వివరించింది. కుంభమేళాకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని.. ఎవైనా ఇబ్బందులు వచ్చిన వెంటనే పోలీసుల సాయం కోరాలని తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. అధికారులకు సహకరించాలని స్పష్టం చేసింది.
అయితే ఈ నిబంధనలు అన్నీ పాటిస్తూ వెళ్తే.. భక్తులు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదూ. ముఖ్యంగా ఈ ఏడు వచ్చే మౌనీ అమావాస్యకు మరిన్ని ప్రత్యేకతలు ఉండడంతో దాదాపుగా 10 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించబోతున్నారు. ఈక్రమంలోనే యూపీ సర్కారు.. భక్తులు ఎవరికీ సమస్యలు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 12 కిలో మీటర్ల మేర అనేక ఘాట్‌లు ఏర్పరిచి.. భక్తులంతా ఎలాంటి ఇబ్బంది, ఆందోళన లేకుండా హాయిగా పుణ్య స్నానాలు చేసుకునే వీలును కల్పిస్తోంది.