ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అక్రమంగా ఇరికించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ తప్పుడు కేసు పెట్టించారని ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేస్తే... తెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఫిర్యాదు చేసిననట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని మండిపడ్డారు. తెరాసాఫ్ట్ ఎండీపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని... కులాల ప్రాతిపదికన చంద్రబాబును ఇరికించేందుకు యత్నించారని అన్నారు. ఫిర్యాదులో చంద్రబాబు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. ఫైబర్ నెట్ కేసులో విచారణ ప్రారంభమైన తర్వాత చంద్రబాబును ఇరికించాలని ఆయన పేరు పెట్టారని జీవీ రెడ్డి తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులో సీఐడీ అధికారులు వేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించిందని చెప్పారు. కానీ, జగన్ పత్రిక సాక్షిలో తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని రాశారని అన్నారు. వైసీపీ హయాంలో పని చేసిన అధికారులందరికీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిందని తెలిపారు. పోస్టింగులు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు పని చేస్తారా? అని ప్రశ్నించారు. అలా అయితే వైసీపీ ప్రభుత్వం అధికారులకు పోస్టింగులు ఇచ్చి... వారితో అనుకూలంగా పని చేయించుకుందని అనుకోవాలా? అని అడిగారు. అధికారులను దిగజార్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తప్పుడు కథనాలను రాసిన సాక్షి పత్రికపై పరువునష్టం కేసు వేసే అంశాన్ని సీఐడీ అధికారులు పరిశీలించాలని అన్నారు. ఫైబర్ నెట్ లో రామ్ గోపాల్ వర్మ చిత్రం 'వ్యూహం' ప్రదర్శనకు సంబంధించిన అక్రమాలపై వర్మకు నోటీసులు ఇచ్చామని... వర్మ నోటీసులు తీసుకున్నారని... అయితే, ఈ కేసులో చెల్లించాల్సిన డబ్బు తన వద్ద లేదని వర్మ చెబుతున్నారని వెల్లడించారు.
![]() |
![]() |