ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదిగల పట్ల వైసీపీ ప్రభుత్వం వివక్షత చూపింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:45 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన లెదర్‌ కర్మాగారాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ లీడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. మంగళవారం రాచర్ల మండలంలోని యడవల్లి సమీపంలోని లీడ్‌క్యాప్‌ లెదర్‌ కర్మాగారాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మాణిక్యాలరావు మాట్లాడుతూ మాదిగల పట్ల నాటి వైసీపీ ప్రభుత్వం వివక్షత చూపుతూ లెదర్‌పార్కుల అభివృద్దిని మరిచిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదిగల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇటీవల గిద్దలూరు నియోజకవర్గంలోని లెదర్‌పార్కు తరలిపోతుందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. నియోజక వర్గంలోని మాదిగల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి లెదర్‌పార్కు ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలుపడంతో ఇక్కడే అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇక్కడే అభివృద్ది చేసి మాదిగలకు చేదోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లెదర్‌పార్కులను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరిగి అభివృద్ది చేసి మాదిగల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో 28వేలకు పైగా మాదిగలు ఉన్నారని, ఇక్కడ ఉన్నటువంటి లెదర్‌పార్కును అభివృద్ది చేయడం వలన వారికి ఉపాధి కలుగుతుందని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే లీడ్‌క్యాప్‌ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రధాన రహదారి నుండి లెదర్‌పార్కు వద్ద రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకుపోవడంతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆయన ఆదేశాలు ఇచ్చారన్నారు. దీంతో కలెక్టర్‌ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రూ.70లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. లీడ్‌క్యాప్‌ ప్రారంభానికి సహకారం అందిస్తున్న చైర్మన్‌ మాణిక్యాలరావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. లెదర్‌పార్కు అభివృద్దికి సహకరిస్తానని, ఎటువంటి సమస్యలు లేకుండా లెదర్‌పార్కు భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ఆక్రమణలకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. లెదర్‌పార్కు కోసం ఏర్పాటు చేసిన 25 ఎకరాల భూమి చుట్టూ కంచె వేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌నాయక్‌, ఏపీఈడబ్లూఐడీసీ ఈఈ భాస్కర్‌రావు, రాచర్ల ఎంపీడీవో వెంకటరామిరెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు కటికె యోగానంద్‌, భవనం పుల్లారెడ్డి, ఎస్సీసెల్‌ అధ్యక్షులు గుర్రం దానియేలు, పందిటి రజని, ప్రసన్నకుమార్‌, పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa