ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెస్టు సెంచరీల్లో సునీల్ గావస్కర్‌ను అధిగమించారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బుధవారం ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీ (104) సాధించారు. ఈ క్రమంలోనే టెస్టుల్లో స్మిత్ తన 35వ శతకాన్ని పూర్తి చేసుకున్నారు. భారత దిగ్గజం సునీల్ గావస్కర్ 34 సెంచరీల రికార్డును స్మిత్ అధిగమించారు. ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 115 మ్యాచ్‌లు ఆడిన స్టీవ్ స్మిత్ 35 సెంచరీలు చేశారు.అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌తో స్మిత్ టెస్టుల్లో 10,000 పరుగుల క్లబ్లో చేరాడు. 9999 రన్స్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ ఆసీస్ బ్యాటర్.. తొలి బంతికే సింగిల్ తీసి 10,000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా స్టీవ్ స్మిత్ నిలిచాడు. అతని కంటే ముందు రికీ పాంటింగ్ (13,378), అలెన్ బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927) ఈ ఫీట్ సాధించారు. 205 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న స్మిత్.. బ్రియాన్ లారా (195), సచిన్ తెందూల్కర్ (195), పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ మైలురాయి అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ (35 సెంచరీలు) ఏడో స్థానంలో ఉన్నాడు. సచిన్ తెందూల్కర్ (51), జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), జో రూట్ (36) స్మిత్ కంటే ముందున్నారు.