ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పించన్ల పంపిణీ జరుగుతోంది. బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరంలోని ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. రూ. 1,000 పెంచేందుకు జగన్ కు నాలుగేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రూ. 1,000 పెంచిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీనే వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ. 15 వేలు పంపిణీ చేస్తూ... దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సగర్వంగా తెలియజేస్తున్నానని చెప్పారు. ఇది పేదల ప్రభుత్వం..పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి మనసున్న ప్రభుత్వమని చెప్పారు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నామని రవికుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నామని, పాఠశాలల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని... ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని అన్నారు.