కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బడ్జెట్ రూ.50 లక్షల కోట్ల మార్కును దాటింది. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ఈసారి రెవెన్యూ లోటు రూ.5.23 లక్షల కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.15.68 లక్షల కోట్లు. 2025-26లో మూలధన వ్యయం రూ.11.2 లక్షల కోట్లు కాగా స్థూల పన్ను రాబడి రూ.42.7 లక్షల కోట్లు అని నిర్మల వివరించారు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.10.82 లక్షల కోట్లు కాగా, జీఎస్టీ సెస్ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు, ఎక్సైజ్ పన్ను వసూళ్లు రూ.3.17 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో రూ.15.82 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది.