శ్రీకాకుళంలో ఓ బీఎస్సీ విద్యార్థినిపై దాడి ఘటన కలకలం రేపింది. కొద్దిరోజుల కిందట జరిగిన ఓ వివాహిత హత్య ఉదంతం మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. సంతకవిటి మండలం కొండగూడెం గ్రామానికి చెందిన కొరికాన లక్ష్మి.. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. 2022లో కళాశాలలో చేరిన ఆ యువతి.. ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం-3లో ఉంటోంది. ఫైనలియర్‌లో ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికైంది. దీంతో కళాశాలకు వెళ్లకుండా నేరుగా ఎల్‌బీఎస్ కాలనీలోని మష్రూమ్ తయారీ కేంద్రంలో శిక్షణ తీసుకుంటూ వసతిగృహంలో ఉంటోంది.
గురువారం శిక్షణ లేకపోవడంతో ఉదయమంతా వసతిగృహంలోనే ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రికార్డుల కోసం అని చెప్పి బయటకు వెళ్లింది. రాత్రి 8-20 గంటల సమయంలో ఒంటిపై గాయాలతో వసతిగృహానికి సమీపాన పడి ఉండడం తోటి విద్యార్థినులకు కనిపించింది. వారు వెంటనే వసతిగృహం వార్డెన్‌కు సమాచారం అందించగా రాత్రి 9గంటల సమయంలో చికిత్స నిమిత్తం యువతిని జీజీహెచ్(రిమ్స్)లో చేర్పించారు. మూర్ఛతో ఆమె పడిపోయి ఉంటుందని భావించి తల్లిదండ్రులకు రాత్రి సమాచారం అందించారు. తల్లిదండ్రులు హుటాహుటిన రిమ్స్‌కు చేరుకున్నారు. వారికి వార్డెన్ పూర్ణ జరిగిన విషయాన్ని వివరించారు. వారు యువతి కన్ను, మోచేయి, గెడ్డం మీద కమిలిన గాయాలు చూసి ఆందోళన చెందారు. తమ కుమార్తెపై ఎవరో దాడి చేశారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దాడి ఘటనగానే అనుమానిస్తున్నారు.దాడి ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థినిపై దాడి ఘటనకు కారణమైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు. వసతిగృహం, కళాశాల సమీపంలో రక్షణ చర్యలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.