కోటబొమ్మాళి పరిధిలోని జర్జంగి సమీపంలోని సాయి శాన్విక దాబాలో శుక్రవారం గంజాయి సేవిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కేరళ నుంచి ఒడిశా వెళ్లే ఒక ప్రైవేటు బస్సు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఇక్కడి దాబా వద్ద ఆగి సిబ్బంది, ప్రయాణికులు భోజనాలు చేస్తుంటారు. దాబా యజమాని సారవకోట మండలం జగన్నాథపురానికి చెందిన కొల్లి బాలరాజుతో పాటు సమీపంలో ఉన్న ఒక గ్రానెట్ పరిశ్రమ లో పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన మోహన్‌లాల్ జంగిడ్, ఒడిశాకు చెందిన బిరేస్వర్ బిస్వస్ గంజాయికి అలవాటు పడ్డారు.
అయితే ఈ ప్రైవేటు బస్సులో పనిచేస్తున్న కేరళకు చెందిన శ్రీజిత్ విజయన్ దాబా యజమాని బాలరాజు అనుమతితో గంజాయి సేవిస్తుండగా.. మాకు కూడా అలవాటు ఉందని, గంజాయి ఇవ్వాలని కోరడంతో సదరు వ్యక్తి ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి దాబా యజమానికి ఇస్తుండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా గంజాయిని తీసుకువచ్చి వారు సేవిస్తుండగా అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ వి.సత్య నారాయణ సిబ్బందితో కలిసి శుక్రవారం తనిఖీ చేయగా నిందితులు పోలీసులను చూసి పారిపోయారు. అయితే జర్జంగి సమీపంలో ఫ్ర్లెఓవర్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు.