కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. నిర్మలా సీతారామన్ ఈసారి కేవలం 75 నిమిషాల బడ్జెట్ ప్రసంగం మాత్రమే చేశారు. గతంలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన వారి జాబితాలో నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. కానీ ఈసారి ఒక గంటా 15 నిమిషాలు మాత్రమే బడ్జెట్ ప్రసంగం చేశారు.నిర్మలా సీతారామన్‌కు ఇది రెండో అతిచిన్న బడ్జెట్ ప్రసంగం. ఇంతకుముందు, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 56 నిమిషాల బడ్జెట్ ప్రసంగం చేశారు.ఇక, నేటి బడ్జెట్ ప్రసంగం ద్వారా నిర్మలా సీతారామన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. అత్యధికసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 2020లో నిర్మలా సీతారామన్ 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. బడ్జెట్ చరిత్రలో ఇది సుదీర్ఘ ప్రసంగం.నిర్మలా సీతారామన్ 2019లో 137 నిమిషాలు, 2020లో 160 నిమిషాలు, 2021లో 110 నిమిషాలు, 2022లో 93 నిమిషాలు, 2023లో 87 నిమిషాలు, 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా 56 నిమిషాలు, 2024 పూర్తిస్థాయి బడ్జెట్ సందర్భంగా 85 నిమిషాలు, ప్రస్తుత 2025 బడ్జెట్ సందర్భంగా 75 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.