ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ చిన్నారిపై మారుతండ్రి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కొన్ని నెలలుగా బాలుడిపై దాడి చేస్తున్న నిందితుడు గాయాలపై కారం చల్లి చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఒళ్లంతా వాతలు తేలి రక్తమెుచ్చేలా దాడి చేస్తున్నాడు. తాజాగా ఆదివారం ఉదయం సైతం బాలుడిపై దాడి చేశాడు ఆ దుర్మార్గుడు. ఫోన్ ఛార్జింగ్ వైర్ తీసుకుని ఒళ్లంతా రక్తం వచ్చేలా కొట్టాడు. గాయాలపై మళ్లీ కారం చల్లాడు. తనపై దాడి చేయవద్దంటూ బాలుడు ఎంత వేడుకున్నా కనికరించలేదు. అయితే చిన్నారి పరిస్థితి చూసిన స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చిన్నారులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.