ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెయిడ్ ఆర్టికల్స్ గుర్తింపులో ఎం.సి.ఎం.సి.లదే కీలక పాత్ర- గోపాలకృష్ణ ద్వివేది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 08:16 PM

రాబోయే ఎన్నికల్లో అత్యంత సున్నితమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, మీడియా సర్టిఫికేషన్, మోనటరింగ్ కమిటీ(ఎం.సి.ఎం.సి) అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. జిల్లాల్లోని ఎం.సి.ఎం.సి. కంట్రోల్ రూమ్‌లు నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పత్రికలు, టీవీల్లో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్‌తో పాటు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో వెల‌గ‌పూడి సచివాలయంలో మీడియా సర్టిఫికేషన్, మోనటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) సభ్యులు, మీడియా ప్రతినిధులతో శ‌నివారం వర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ సందర్బంగా గోపాల‌త‌కృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఎమ్మెల్సీ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎం.సి.ఎం.సి.లు ఎంతో కీలకమన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెయిడ్ ఆర్టికల్స్ పెద్ద సమస్య అని అన్నారు. పత్రికలు, టీవీల్లో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్ తో పాటు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎం.సి.ఎం.సి. ఆధ్వర్యంలో జిల్లాల్లో ఉండే కంట్రోల్ రూమ్ లు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉన్న ఎం.సి.ఎం.సి.ల్లో ఐదుగురు సభ్యులున్నారని, వారితో వివిధ రకాల మీడియాల్లో వచ్చే వార్తలను పర్యవేక్షించడం కష్టమన్నారు. కనీసం 15 నుంచి 20 మంది వరకూ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారు ఎం.సి.ఎం.సి. సభ్యులగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్ లు 24 గంటలూ పనిచేస్తూ, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తామిచ్చే సాఫ్ట్ వేర్ కంటే ఇంకా మెరుగైన సాఫ్ట్ వేరులున్నా ఎం.సి.ఎం.సి.లు వాడుకోవొచ్చునన్నారు. సాంకేతిక వినియోగించడం ద్వారా శారీరక శ్రమ కొంత తప్పుతుందన్నారు. మద్యం, నగదు వంటి తాయిలాలు పంపిణీతో  అత్యధిక ఎన్నికల ఖర్చయ్యే రాష్ట్రం ఆంధ్ర్రప్రదేశ్ అని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అతి సున్నితమైన ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరు తెన్నుల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధిక సంఖ్యలో ఎన్నికల పరిశీలకులు రానున్నారని అన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేలా కృషి చేయాలని ఆదేశించారు. 


                   వీవీ ప్యాట్ లలో ఓటరు ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటేశారో తెలుపుతూ 7 సెకండ్ల పాటు కనిపిస్తుందన్నారు. అనంతరం వీవీ ప్యాట్లకు అమర్చిన బాక్సులో ఓటరు వేసిన ఓటులోని అభ్యర్థి పేరు, గుర్తు వివరాలతో కూడిన స్లిప్ పడిపోతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలుకూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీవీ ప్యాట్లతో కూడిన ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెయిడ్ ఆర్టికల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. పెయిడ్ ఆర్టికల్స్ ను ఎం.సి.ఎం.సి. సభ్యులు గుర్తించి, అభ్యర్థి ఖాతాల్లో జమ చేయాలన్నారు. అసెంబ్లీ అభ్యర్థులకు రూ.28 లక్షలు, లోక్ సభ సభ్యులకు రూ.70 లక్షల వరకూ వ్యయం చేసుకునే సౌలభ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. అంతకుముంచి ఖర్చు చేసే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి అనర్హులన్నారు. పార్టీల వ్యయంపై ఎటువంటి నియంత్రణా లేదన్నారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపర్చే స్ట్రాంగ్ రూమ్ ల బయట ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి, వాటిలో కౌంటింగ్ ప్రారంభమయ్యే వరకూ అభ్యర్థులను గాని, వారి ఏజెంట్లుగాని ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన తరవాతే పెయిడ్ ఆర్టికల్స్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. పెయిడ్ ఆర్టికల్స్, ప్రకటనలు వస్తే, అభ్యర్థులకు మాత్రమే నోటీసులు జారీచేయాలన్నారు. ఎం.సి.ఎం.సి. సభ్యులకు నోటీసులిచ్చే అధికారం లేదని, ఆర్.వో.లకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. బెల్ కంపెనీ ప్రతినిధులు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరును వివరించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa