మధ్యాహ్న భోజన పథకం సరుకులను హెల్పర్ ఇంటికి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పాఠశాల కమిటీ చైర్మనే స్వయంగా ఫొటోలు తీసి ఇంటిదొంగ గుట్టురట్టు చేశాడు. నంబులపూలకుంటలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి హెల్పర్ అమీనపీరా కోడిగుడ్లు, బియ్యం, హార్పిక్ డబ్బాలను తీసుకెళుతుండగా.. పాఠశాల కమిటీ చైర్మన బాబ్జీ సెల్‌లో చిత్రీకరించారు. అది సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బాబ్జీ విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివారం సెలవు రోజు పాఠశాల తలుపులు తెరచి కోడిగుడ్లు, బియ్యం, హార్పిక్ డబ్బాలు తరలిస్తుండగా తన కంట పడ్డాడని వివరించారు. అప్పటికే కొన్ని బియ్యం బస్తాలు తరలించారని తెలిపారు. తాను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పారని అన్నారు. దీనిపై సోమవారం వివిధ పార్టీల నాయకులు పాఠశాలకు చేరుకుని ఆరా తీశారు. ఎంఈఓలు సుబ్బిరెడ్డి, గోపాల్‌నాయక్, హెచఎం శిరీషా, పాఠశాల కమిటీ చైర్మన బాబ్జీ హెల్ప్‌ర్ అమీనపీరాను విచారించారు. కోడిగుడ్లను ఉడకపెట్టి పంపిణీ చేయడానికి, బియ్యాన్ని శుభ్రం చేయడానికి ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. హార్పిక్ డబ్బాలు ఎందుకు తీసుకెళ్లారని బీజేపీ నాయకులు ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు షేక్‌బాబ్‌జాన తెలిపారు. ఎంఈఓ సుబ్బిరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో జరిగిన విషయం డీఈఓ దృష్టికి వెళ్లిందన్నారు. ఘటనపై హెచఎం శిరీషా నుంచి రాత పూర్వకంగా వివరణ తీసుకున్నట్లు తెలిపారు.