చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలని, వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాల వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. రెండు వారాల లండన్ పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్న వైయస్ జగన్, మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు.రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్ అమలు విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన, ఎన్నికల హామీల అమలుపై ఆయన వైఖరిని మరోసారి తేటతెల్లం చేశాయని ఈ సందర్భంగా వైయస్ జగన్ అన్నారు. సూపర్‌సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా.. అందుకే ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలా అవి ఇప్పుడు ఆచరణకు సాధ్యం కాదంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒకవైపు హామీలన్నీ తుంగలో తొక్కడం, మరోవైపు విద్యుత్ ఛార్జీల మోత.. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీయడం.. వంటి అంశాలను కూడా ప్రజల్లో ఎండగట్టాలని ఆయన నిర్దేశించారు. చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని వైయస్ జగన్ సూచించారు.