సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విరుచుకుపడ్డారు. నిన్న ఆకివీడులో జరిగిన ఘటనకు సునీల్ బాధ్యత వహించాలని అన్నారు. వివరాల్లోకి వెళితే ఆకివీడులో నిన్న సాయంత్రం సునీల్ కుమార్ అనుచరులు హల్ చల్ చేశారు. ఇన్నోవా కారుకు పోలీస్ స్టిక్కర్ వేసుకుని వచ్చి మున్సిపాలిటీ వద్ద కొందరు వ్యక్తులు గొడవ చేశారు. కారుపై సునీల్ కుమార్ ఫొటో కూడా ఉంది. సునీల్ కుమార్ చెబితేనే వాళ్లు వచ్చినట్టు తాము తెలుసుకున్నామని చెప్పారు. ఇన్నోవా కారు సునీల్ అనుచరుడు జోగారావు పేరుపై ఉందని తెలిపారు. కారులో వచ్చిన వాళ్లు ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేశారని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. ఆకివీడులో కోర్టు అనుమతులతో ఆక్రమణలను పోలీసులు తొలగిస్తున్నారు. ఆక్రమణదారులకు మద్దతుగా ఘర్షణ సృష్టించేందుకు సునీల్ కుమార్ అనుచరులు ఆకివీడులో తిరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇది రఘురామ నియోజకవర్గం కావడంతో, ఆయన కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.