ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ.. వైసీపీల‌కు గుంటూరు స‌వాల్‌!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2019, 08:18 PM

రాజ‌కీయ రాజ‌ధాని.. గుంటూరు ఇది నిన్న‌టి మాట‌. ఇప్పుడు ఏపీ రాజ‌ధానిగా మారింది. సాధార‌ణంగానే అక్క‌డ రాజ‌కీయాలు ఘాటుగా ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తుల‌తో ప్ర‌త్య‌ర్థినే కాదు.. న‌చ్చ‌క‌పోతే సొంత‌పార్టీ నేత‌ల‌కే చుక్క‌లు చూపించ‌గ‌ల స‌మ‌ర్థ‌ల ఖిల్లా గుంటూరు జిల్లా. అటువంటి చోట‌.. 2019 ఎన్నిక‌లు టీడీపీ, వైసీపీల‌కు స‌వాల్‌గా మారాయి. ఇదంతా గెలుపుకోసం అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే.. ఈ టెన్ష‌న్ కేవ‌లం సీట్ల పంపకంలోనే కావ‌ట‌మే చ‌ర్చ‌నీయాంశం. గ‌త ఎన్నిక‌ల్లో బోలెడంత భ‌రోసాతో వైసీపీ తాము క‌ర్ర‌పుల్ల‌ను నిల‌బెట్టినా గెలుస్తామ‌నే ధీమాగా ఉన్నారు. ఇప్పుడు అదే ప‌రిస్థితిలో టీడీపీలో నెల‌కొన్నాయి. దీంతో టీడీపీలో గుంటూరు జిల్లా అసెంబ్లీ సీట్ల‌పై మ‌రింత పోటీ నెల‌కొంది. పాత నేత‌లు.. వ‌ల‌స నేత‌ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన డ్రామా సాగుతోంది. దీంతో చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఆచితూచి అడుగేయాల్సిన ప‌రిస్థితి. ఏపీలో అధికారం సంపాదించేందుకు అత్య‌థిక సీట్ల‌ను గెల‌వాల్సిన నాలుగైదు జిల్లాల్లో గుంటూరు కూడా ఒక‌టి కావ‌ట‌మే దీనికి కార‌ణం. నోటిఫికేష‌న్ వెలుబ‌డిన రెండ్రోజుల‌కే త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామంటూ జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. చంద్ర‌బాబు మాత్రం.. తెలంగాణ‌లో ఎదురైన అనుభ‌వంతో ముందుగానే అభ్య‌ర్థుల‌ను డిక్లేర్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం గుంటూరుజిల్లాపై దృష్టిసారించారు. గుంటూరు ఎంపీ సీటు గ‌ల్లాజ‌య‌దేవ్‌కు ఖ‌రారు చేశారు. గుంటూరు ప‌శ్చిమం, గుంటూరు తూర్పు, మంగ‌ళ‌గిరి, తాడికొండ‌, ప్ర‌త్తిపాడు, పెద‌కూర‌పాడు, స‌త్తెన‌ప‌ల్లి, త‌దిత‌ర అసెంబ్లీ సీట్ల‌లో అభ్య‌ర్థుల‌ను స‌ర్దుబాటు చేయ‌టం త‌ల‌నొప్పిగా మారింది. మంగ‌ళ‌గిరిలో కాండ్రు క‌మ‌ల టీడీపీలోకి చేరారు. వైసీపీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే స్థానంలో ఉడ‌తా శ్రీను రంగంలోకి దింపింది. పెద‌కూర‌పాడులోనూ వైసీపీ మ‌నోహ‌ర్‌నాయుడును అలాగే ఉంచి కంభంపాటి శంక‌ర్‌రావును కూడా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నిలిపింది. గుంటూరు తూర్పు త‌న‌కు కావాలంటూ సినీ న‌టుడు అలీ గోలీ వేశాడు. ఏకంగా ఓటుహ‌క్కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. గుంటూరు ప‌శ్చిమంలో క‌మ్మ‌, కాపు, బ్రాహ్మ‌ణ వ‌ర్గాలు పోటీ ప‌డుతున్నాయి. ప్ర‌త్తిపాడులోనూ ముగ్గురు నేత‌లు పోటీలో ఉన్నారు. తాడికొండ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావ‌ణ్కుమార్ కు సీటివ్వ వ‌ద్దంటూ పార్టీ శ్రేణులు వ్య‌తిరేక‌త‌ను వెలిబుచ్చాయి. స‌త్తెన‌ప‌ల్లిలో కోడెల‌పై పెరిగిన వ్య‌తిరేక‌త పార్టీను అప్ర‌తిష్ఠ‌పాల్జేసిందంటూ చంద్ర‌బాబు వ‌ద్ద ఓ వ‌ర్గం పంచాయ‌తీ పెట్టింది. పెద‌కూర‌పాడులో కొమ్మాల‌పాటిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావ‌న ఉంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. దీంతో.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు ఆచితూచి స్పందించాల్సి వ‌స్తోందంటూ సీనియ‌ర్లు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో 11-12 వ‌ర‌కూ నెగ్గాల‌నేది టీడీపీ వ్యూహం. కానీ.. సిట్టింగ్‌ల‌పైనే వ్య‌తిరేక‌త ఉన్న నేప‌థ్యంలో టీడీపీ ప‌రిస్థితి అగమ్య‌గోచ‌రంగా మారింది. వైసీపీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చాల‌నే ఆలోచ‌న‌తో ఉండ‌టంతో.. కొత్త‌గా వ‌చ్చే అభ్య‌ర్థుల‌కు కేడ‌ర్ ఎంత‌వ‌ర‌కూ స‌హ‌రిస్తుంద‌నే ఆందోళ‌న కూడా లేక‌పోలేదు. జ‌న‌సేన కూడా ఇక్క‌డ కీల‌కంగా మారింది. బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం ప‌వ‌న్ వైపు మొగ్గుచూపుతుండ‌టంతో.. జ‌న‌సేన కూడా ప్ర‌ధాన పార్టీల‌కు గ‌ట్టిపోటీ ఇస్తుంద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa