జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ జిల్లా పర్యటన ఖరారైంది. రెండు రోజుల పాటు రోడ్‌షో నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టీ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ ఆదివారం రాత్రి నెల్లూరు ధనలక్ష్మీపురంలోని కేజీకే కళ్యాణ మండపానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు అల్పాహారం తర్వాత ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. తర్వాత జిల్లాకు చెందిన వీఐపీలు, ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడతారు. ఆపై జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థులు, మేథావులతో ముఖాముఖి కార్యక్రమం చేపడతారు.
మధ్నాహ్నం భోజన విరామం తర్వాత 2.30 గంటలకు పవన్ కల్యాణ్ రోడ్‌షో ప్రారంభిస్తారు. ముందుగా ఆనం వెంకటరెడ్డి విగ్రహం దగ్గరకు వెళ్లి అక్కడ నుంచీ శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహం, బోసు బొమ్మ, కనకమహల్ సెంటర్ల మీదుగా గాంధీ బొమ్మ దగ్గరకు చేరకుంటారు. అక్కడ నగర నియోజకవర్గానికి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత వీఆర్‌సీ సెంటర్, మద్రాసు బస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా ఫత్తేఖాన్‌పేట రైతుబజార్‌కు చేరుకుంటారు.
పవన్ కళ్యాణ్ చిన్నతనంలో నివసించిన ఇంటిని సందర్శించి బాల్య స్నేహితులను పలకరిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. అక్కడ నుంచి కేవీఆర్ పెట్రోలు బంకు, వేదాయపాళెం, నల్లపరెడ్డి విగ్రహం మీదుగా పొదలకూరు రోడ్డు డైక్‌సరోడ్డు సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత ధనలక్ష్మీపురంలోని కేజీకే కళ్యాణమండపం చేరుకుంటారు. సోమవారం రాత్రి అక్కడే బస చేసి తిరిగి మంగళవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి కోవూరు, కావలిలో జరిగే రోడ్‌షోలో పాల్గొని రోడ్డుమార్గాన ప్రకాశం జిల్లాకు వెళతారని పార్టీ వర్గాలు వివరించాయి.
నగర నియోజకవర్గ సభకు... కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, రూరల్ నియోజకవర్గ సభకు... చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి అధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్‌కళ్యాణ్ పర్యటనకు ముందస్తుగా అనుమతులు కోరుతూ పోలీసు యంత్రాంగానికి, అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు వారు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa