ఫ్రెషర్ల నియామకాల విషయంలో ఆ మధ్య తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ ఎట్టకేలకు గతేడాది వారిని విధుల్లోకి తీసుకుంది. అయితే, ఇందులో కొంతమందికి సంస్థ తాజాగా ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వరుస ఎవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమవడంతో వారిని తొలగించినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ట్రైనీలు గా చేరిన వారిలో సగం మందిపై వేటు పడినట్లు సమాచారం. వరుసగా మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని తొలగిస్తున్నారట. ట్రైనీలను బ్యాచ్‌ల వారీగా పిలిచి వారితో ‘మ్యూచువల్ సెపరేషన్’ లెటర్లపై సంతకాలు చేయించుకుంటున్నట్లు సదరు కథనాలు తెలిపాయి. అయితే, దీనిపై ఇన్ఫోసిస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
‘‘ఇది చాలా అన్యాయం. మేం ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పరీక్షలను చాలా కఠినంగా పెట్టారు. ఇప్పుడు మా భవిష్యత్తు కష్టంగా మారింది’’ అని ఉద్వాసనకు గురైన ఓ ట్రైనీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్‌ను వీడాలని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలపై నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది.2022-23 నియామక ప్రక్రియలో భాగంగా 2000 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది. సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ తదితర పోస్టులకు ఎంపిక చేస్తూ, వారికి అదే ఏడాది ఆఫర్ లెటర్లు ఇచ్చింది. వారంతా 2022 బ్యాచ్ ఉత్తీర్ణులు. అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసినా వీరిని విధుల్లోకి తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు సైతం నమోదైంది. ఈ క్రమంలో రెండేళ్లు ఆలస్యంగా 2024 ఏప్రిల్‌లో వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది.
![]() |
![]() |