ఆ రైతుకు ఆ పాడి ఆవులే జీవానాధారం. తనకు, తన కుటుంబానికి అన్నం పెడుతున్నవి అవే. అలాంటి పాడి ఆవులు ఓ రోజు కనిపించకుండా పోయాయి. సాయంత్రం పశువుల షెడ్డులో కట్టేసి వెళ్లిన ఆవులు.. ఉదయం వచ్చి చూసేసరికి మాయమయ్యాయి. ఏం చేయాలో తోచలేదు. పోలీసులను ఆశ్రయించాడు. అక్కడా నిరాశ ఎదురైంది. దీంతో ఏమీ పాలుపోని స్థితిలో ఆ రైతు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఆవుల కోసం తానే పోలీసుగా మారి, డిటెక్టివ్ రేంజులో పరిశోధించాడు. చివరకు ఏమైంది.. అతని ఆవులు అతనికి దక్కాయా.. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇండ్లవెంకటాంపల్లిలో జరిగిన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం
ఉదయం నుంచి పొలం పనులు, పశువుల మేత వంటి పనులన్నీ పూర్తిచేసుకుని వచ్చి సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో అలా మంచం మీద నడుం వాల్చాడు ఫణీంద్రరెడ్డి. ఎదురుగా పశువుల కొట్టం కనిపిస్తోంది. కొట్టంలో పాలు పితుకుతున్న ఇల్లాలు. రెండు పాడి ఆవులు కనిపించాయి.. కాస్త ధైర్యం కలిగింది. మనసు కుదుటపడింది. వాన దేవుణ్ని నమ్ముకుని చేన్లో పంట పెడితే.. ఆకాశం నుంచి రాలే వాన చినుకుల కంటే.. రైతన్న కంట్లో నుంచి రాలే కన్నీటి చుక్కలే ఎక్కువగా ఉండే ప్రాంతమది. కానరాని వానలు.. నెర్రెలిడిచిన నేలలు.. బీడువారిన భూములు.. మోడువారిన జీవితాలు.. ఇదీ ఆ ప్రాంత పరిస్థితి. దీంతో వ్యవసాయంతో పాటుగా అనుబంధంగా ఇలా పాడిపశువులు పెంచుకుంటూ ఉంటారు. వాన దేవుడి దయ లేకపోయినా.. పాడి పశువుల ద్వారా అయినా నాలుగు రూకలు సంపాదించుకుని, మూడు పూటలా తిండి తినొచ్చనే ఆలోచన వారిది.
ఫణీంద్రరెడ్డి కూడా అలాగే రెండు పాడి ఆవులు మేపుతున్నాడు. ఆ ఆవు పాలు అమ్మగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో తనకు, తన కుటుంబానికి బువ్వ పెట్టే ఆ గోమాతలంటే ఫణీంద్రకు ఎంతో ఇష్టం. వాటిని చూస్తే.. తన కుటుంబ పోషణకు వచ్చిన భయమేమీ లేదనే ఓ భరోసా. ఆ రోజు కూడా ఆ పాడి ఆవులను చూడగానే ఫణీంద్రకు అదే ధైర్యం వచ్చింది. పొలంలోని షెడ్డులో ఆవులకు మేతవేసి ఫణీంద్ర రెడ్డి ఇంటికి చేరుకున్నారు. యధావిధిగా మరుసటి రోజు ఉదయాన్నే పాలు పితుకుదామని పొలంలో ఉన్న షెడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి చూసిన ఫణీంద్రకు గుండెల్లో రాయిపడినంత పనైంది. షెడ్డులో కట్టేసిన రెండు ఆవులు, దూడ కనిపించలేదు. దీంతో ఫణీంద్ర కంగారుపడిపోయాడు. ఏం చేయాలో తోచలేదు.
వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు పరుగు తీశాడు. తన ఆవులు, దూడ కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రైతు ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించలేదు. ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండానే.. ఆవులు ఎవరు చోరీ చేశారో గుర్తించాలంటూ ఫణీంద్ర రెడ్డికి సలహా ఇచ్చారు. దీంతో రైతు ఫణీంద్రకు ఏమీ తోచలేదు. ఓ వైపు పోలీసులు పట్టించుకోవడం లేదు. మరోవైపు తన కుటుంబానికి జీవానాధారమైన పాడి ఆవులు కనిపించడం లేదు. కొద్ది సేపు ఏం చేయాలో తోచలేదు. చివరకు పోలీసులు చెప్పిన ప్రకారం తన ఆవులను తానే వెతుక్కోవాలని నిర్ణయానికి వచ్చాడు. కనిపించకుండా పోయిన తన ఆవుల ఆచూకీ కనిపెట్టడం కోసం ఆ రైతే.. ఓ డిటెక్టివ్‌గా, పోలీస్‌గా మారిపోయాడు.
తన పశువుల షెడ్డు చుట్టుపక్కల ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని తొలుత పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. తన ఆవులను ఓ వాహనంలో తీసుకెళ్తున్నట్లు ఫణీంద్ర రెడ్డి గుర్తించారు. సినిమాల్లో మాదిరిగా సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించిన వాహనం ఆచూకీ తెలుసుకున్నారు. ఆ వాహనం డ్రైవర్‌ను కలుసుకుని ఆవుల గురించి విచారించారు. వాహనం డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం స్థానికంగా పశువుల వ్యాపారం చేసే వ్యక్తి తన ఆవులను చిత్తూరు జిల్లా పుంగనూరుకు తరలించినట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆ డ్రైవర్‌ను వెంటబెట్టుకుని పుంగనూరు చేరుకున్నాడు ఫణీంద్రరెడ్డి.
అక్కడ ఓ వ్యాపారికి తన ఆవులను లక్షా 50 వేల రూపాయలకు విక్రయించినట్లు తెలుసుకున్నారు. ఆ వ్యాపారిని కలుసుకుని.. జరిగిన తతంగమంతా వివరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని భయపెట్టడంతో ఆ వ్యాపారి.. రెండు ఆవులను తిరిగి ఫణీంద్రరెడ్డికి అప్పగించారు. దీంతో ఐదు రోజుల తర్వాత చోరీకి గురైన ఆవులతో ఫణీంద్రరెడ్డి శనివారం తన ఊరికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఫణీంద్రరెడ్డిని స్థానికులు అభినందిస్తున్నారు. పోలీసుల కూడా ఆవులను చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. అలా కనిపించకుండా పోయిన తన ఆవుల కోసం ఓ రైతన్న.. పోలీసుగా మారి డిటెక్టివ్ రేంజులో శోధించి.. వాటిని తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. అయితే ఆవులను కొని మోసపోయిన వ్యాపారికి.. పోలీసులు న్యాయం చేస్తారా అనేది చూడాలి మరి.
![]() |
![]() |