మాఘ ఆదివారాన్ని పురస్కరించుకుని అరసవల్లిలో ఆదిత్యుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రపుష్కరిణి సమీపాన రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించి, క్షీరాన్నం వండి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉన్న షెడ్లను అధికారులు తొలగించారు. కానీ ఆదివారం నాడు రద్దీకి సరిపడా టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎండలో అవస్థలు పడ్డారు. తాగునీటి వసతి కూడా లేక ఇబ్బందులు పడ్డారు. ప్రసాదాల కౌంటర్ వద్ద కూడా ఎండలోనే బారులుదీరారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ప్రత్యేక దర్శనాలకు అనుమతించే ఆలయ ముఖద్వారం వద్ద భక్తులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆలయ అధికారులెవరూ రాలేదు. దినసరి వేతన సిబ్బంది ఏం చేయలేక నిస్సహాయంగా కనిపించారు. ప్రత్యేక దినాల్లో కూడా ఆలయ అధికారులు అందుబాటులో లేకపోవడం దారుణమని, ఇంతకు మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితులను చూడలేదని పలువురు భక్తులు వాపోయారు. అధికారులు స్పందించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
![]() |
![]() |