విష్వక్షేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పృథ్వీ మాట్లాడుతూ... ఈ సినిమాలో తాను మేకల సత్యం పాత్ర పోషించానని... షాట్ గ్యాప్ లో తన వద్ద ఉన్న మేకలు లెక్కబెడితే 150 వరకు ఉన్నాయని... తాను జైలు నుంచి బయటికివచ్చినప్పుడు లెక్కబెడితే 11 మేకలే ఉన్నాయని... అదేంటో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. లైలా సినిమాలో ఇలాంటి బ్రహ్మాండమైన సీన్లు ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. దాంతో, తన చిత్రానికి నష్టం కలిగే సూచనలు కనిపిస్తుండడంతో లైలా చిత్ర హీరో విష్వక్సేన్ రంగంలోకి దిగారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. పృథ్వీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, వాటిని తమకు అపాదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ వ్యాఖ్యలు తన సినిమా ఈవెంట్ లో చేశాడు కాబట్టి తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు.పృథ్వీ చెప్పినట్టు సినిమాలో అన్ని మేకలు లేవని విష్వక్సేన్ వివరణ ఇచ్చారు. పృథ్వీకి, మాకు ఎలాంటి సంబంధం లేదు... పృథ్వీ ఈ సినిమాలో ఒక నటుడు మాత్రమే అని స్పష్టం చేశారు. బాయ్ కాట్ లైలా (#BoycottLaila) హ్యాష్ ట్యాగ్ తో 22 వేల ట్వీట్లు వేశారని, రిలీజ్ రోజే హెడ్ డీ ప్రింట్ బయటికి తెస్తామని బెదిరిస్తున్నారని విష్వక్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాతో ఏం శత్రుత్వం ఉంది... నేను ఏం అన్యాయం చేశాను? ఎవరో చేసిన తప్పుకు మా సినిమాను బలిచేయొద్దు అని ఆక్రోశం వెలిబుచ్చారు.
![]() |
![]() |