డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వివాదాస్పద నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలపై అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచి.. వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన మరో బాంబు పేల్చారు. ఈసారి అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న సుంకాలకు తోడు ఇది అదనమని, ఈ వారంలోనే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
ఆదివారం న్యూఓర్లియన్స్‌కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మంగళవారం నాటికి పరస్పర సుంకాలను ప్రకటిస్తానని, ఇది దాదాపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, పరస్పర సుంకాలతో ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారో మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. కానీ, ఇతర దేశాలు విధించే సుంకాల రేట్లతో సరిసమానంగా అమెరికా వ్యవహరిస్తుందని, ఇది అన్ని దేశాలకు వర్తిస్తుందని మాత్రం అమెరికా అధ్యక్షుడు నొక్కి చెప్పారు. ‘మా నుంచి వసూలు చేస్తే.. మేము వారి నుంచి వసూలు చేస్తాం’ అని పరస్పర సుంకాల ప్రణాళికపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం దిగుమతి సుంకాలను ట్రంప్ విధించారు. కానీ, కెనడా, మెక్సికో, బ్రెజిల్ సహా పలు వాణిజ్య భాగస్వామ్యలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్.. ఈ కోటాను కొనసాగించారు. అయితే, మరోసారి ట్రంప్ వడ్డనకు సిద్ధం కావడంతో కెనడా, మెక్సికోలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అధికారిక డేటా ప్రకారం.. అమెరికా ఉక్కు దిగుమతుల్లో సింహభాగం కెనడా, మెక్సికో, బ్రెజిల్ నుంచే జరుగుతాయి. ఆ తర్వాతి దక్షిణ కొరియా, వియత్నాం ఉన్నాయి. ఇక, అల్యూమినియం విషయానికి వస్తే కెనడా ప్రధాన సరఫరాదారు. దీనిని ఎగుమతి చేసి భారీగానే కెనడా లబ్ది పొందుతుంది. 2024లోని మొదటి 11 నెలల్లో మొత్తం అల్యూమినియం దిగుమతుల్లో 79 శాతం కెనడా నుంచే వచ్చాయి. ఆ తర్వాతి స్థానం మెక్సికోదే.
ఇక, పరస్పర సుంకాల ప్రణాళికపై మంగళవారం లేదా బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెళ్లడిస్తానని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఆటోమొబైల్ దిగుమతులపై యూరోపియన్ యూనియర్ విధించిన 10 శాతం సుంకాలు అమెరికన్ కార్ల రేటు 2.5 శాతం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పదే పదే అంటున్నారు. ఐరోపా సమాఖ్య మన కార్లను తీసుకెళ్లదు కానీ ఏటా అట్లాంటిక్ మీదుగా లక్షలాది వాహనాలను రవాణ చేస్తుందని తరుచూ ఆరోపిస్తున్నారు.
![]() |
![]() |