వీఐపీల భద్రత కోసం కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వీఐపీల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు చేయాలంటూ హోం మంత్రిత్వశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 10 టయోటా ఫార్చూనర్ వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చాలని.. ఏపీ హోం శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టయోటా ఫార్చూనర్ వాహనాల కొనుగోలుతో పాటుగా వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చేందుకు గానూ రూ.9.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను రాష్ట్రంలోని కొంతమంది ముఖ్యులతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీల కోసం ఉపయోగిస్తారు.
మరోవైపు పర్యాటక ప్రాంతాలు, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటుగా పలు వ్యాపార, రాజకీయ కారణాలతో పలువురు వీఐపీలు రాష్ట్రానికి వస్తూ పోతూ ఉంటారు. అలాగే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వ్యాపారవేత్తలు కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర్లంలోని కొంతమంది ముఖ్యులతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలకు రక్షణగా ఉంటాయనే ఉద్దేశంతోనే కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
![]() |
![]() |