భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థల్లో పినాక రాకెట్ లాంచర్ వ్యవస్థ ఒకటి. యుద్ధరంగంలో సులువుగా ఒకటి చోటి నుంచి మరొక చోటికి తరలించగల ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థ భారత్ అమ్ములపొదిలో కీలకంగా నిలుస్తోంది. కాగా, ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ... ఫ్రెంచ్ దేశాధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పినాక రాకెట్ లాంచర్ వ్యవస్థలను ఫ్రాన్స్ కు అందజేసేందుకు ప్రతిపాదించారు. భారత్ వచ్చి పినాక ఆర్టిలరీ రాకెట్ లాంచర్ వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించాలని మోదీ ఫ్రాన్స్ సైనికాధికారులకు ఆహ్వానం పలికారు. పినాక రక్షణ వ్యవస్థలను ఫ్రాన్స్ కొనుగోలు చేసినట్టయితే... ఇరుదేశాల ద్వైపాక్షిక రక్షణ సంబంధాల్లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు. పినాక రాకెట్ వ్యవస్థలను భారత్ ఇప్పటికే ఆర్మేనియా, పలు ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తోంది. పినాక వ్యవస్థలో 45 కిలోమీటర్ల షార్ట్ రేంజి మిస్సైళ్లు ఉంటాయి. వీటి రేంజిని 120 నుంచి 300 కిలోమీటర్లకు పెంచేందుకు డీఆర్డీవో కృషి చేస్తోంది. కాగా, భారత్-ఫ్రాన్స్ మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ భారత్ కు శత్రుభీకర రఫేల్ యుద్ధ విమానాలను, స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్ సంస్థ భారత్ లో ఇప్పటికే హెలికాప్టర్ ఇంజిన్లను తయారు చేస్తోంది. అంతేకాదు... భారత ఐదో తరం 'ఆమ్కా' స్టెల్త్ యుద్ధ విమానానికి ఇంజిన్ తయారీలో సఫ్రాన్... డీఆర్డీవోతో కలిసి పనిచేస్తోంది.
![]() |
![]() |