గ్రామీణ ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా గ్రామాలకు సుపరిపాలన అందించవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ బుధవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ గ్రామసభల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజలకు ఏమి అవసరమో తెలుస్తుందన్నారు. గ్రామపాలన అందించే స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు మండలాలకు చెందిన 15 పంచాయతీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వికసిత్ పంచాయత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సామర్థ్యం పెంపొందించేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించింది. అందుకు వ్యూహాత్మక కార్యాచరణ కోసం ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, ఒడిసా రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి వర్క్‌షాపు నిర్వహించారు. వర్క్‌షాపులో అడిషనల్ కమిషనర్ సుధాకర్‌రావు, అల్లూరి జిల్లా జడ్పీ సీఈవో, జడ్పీపీపీ, డీపీవో, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
![]() |
![]() |