గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ రియాక్టయ్యారు. ఈ మేరకు బహిరంగ లేఖను మంగ్లీ విడుదల చేశారు. శ్రీకాకుళంలో ఏటా జరిగే అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్‌కు తనను ఆహ్వానించడం తన అదృష్టమని అందులో పేర్కొన్నారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యిందని.. శ్రీకాకుళం ప్రజలు చూపిన అభిమానం ఈ జన్మలో మరిచిపోలేనని మంగ్లీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని తన బృందాన్ని అభినందించి, సత్కరించారని గుర్తు చేసుకున్నారు.
అయితే ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అరసవల్లి సూర్యభగవానుడి ఆలయాన్ని సందర్శించామని.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక కళాకారిణిగా నన్ను వాళ్లతోపాటు ఆలయానికి ఆహ్వానించారని మంగ్లీ తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఎవరున్నా దైవ దర్శనం కల్పిస్తారని లేఖలో మంగ్లీ పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక ఆడబిడ్డగా తనను ఆశీర్వదించారని, గొప్పమనసుతో కళాకారిణిగా నన్ను గౌరవించారని మంగ్లీ తెలిపారు. కళాకారిణిని గౌరవించడం తప్పు అవుతుందా అని ప్రశ్నించారు.
దేవుని కార్యక్రమానికి రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయమన్న సింగర్ మంగ్లీ.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు కొందరు సంప్రదిస్తే వైసీపీకి పాటపాడానని గుర్తు చేసుకున్నారు. అలాగే రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేశానని.. అయితే అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్లు కావటంతో ప్రచారంలో పాల్గోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రచారంలో కూడా ఇతర పార్టీల వారిని ఎవరినీ ఒక్క మాట అనలేదని, దూషించలేదని మంగ్లీ చెప్పుకొచ్చారు. అలాగే తానెక్కడా పార్టీ జెండా ధరించలేదని.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని గుర్తుచేశారు.
ఒక కళాకారిణిగానే వైసీపీకి పాటలు పాడానన్న సింగర్ మంగ్లీ.. వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడినట్లు గుర్తుచేశారు. అయితే అప్పటికే తనపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు తన పాట దూరమైందని.. చాలా అవకాశాలు కోల్పోయి, అవమానాలు ఎదుర్కొన్నానని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే 2024 ఎన్నికల సమయంలో వైసీపీతో పాటుగా అన్ని పార్టీలూ పాటలు పాడాలని కోరినా తిరస్కరించినట్లు మంగ్లీ వివరించారు. తన పాట ప్రతీ ఇంట్లో పండగ పాట కావాలే కాని.. పార్టీల పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని.. రాజకీయాలకు అతీతంగా అందరూ తనను ఆదరించాలని, అభిమానించాలని కోరుకుంటున్నట్లు మంగ్లీ లేఖలో రాసుకొచ్చారు.
మరోవైపు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకోవటంతో పాటుగా ఒక కళాకారిణీగా తనను గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు అప్పట్లో తనను సంప్రదించారని సింగర్ మంగ్లీ తెలిపారు. ఆయితే ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డానని.. కానీ అది రాజకీయ పదవి కాదని తన శ్రేయోభిలాషులు సూచించారన్నారు. అలాగే తమ ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిలో కొనసాగినట్లు మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పదవి గురించి తాను ఎక్కడా బహిరంగంగా ప్రకటించుకోలేదని చెప్పుకొచ్చారు. తాను పాటను నమ్ముకునే వచ్చాను కానీ.. పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని మంగ్లీ లేఖలో రాసుకొచ్చారు.
చంద్రబాబును తాను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ది కోసం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ వాపోయారు. చంద్రబాబుకు తాను పాట పాడను అన్నది ముమ్మాటికీ వాస్తవం కాదని.. ఈ విషయంపై ప్రమాణం చేసి చెబుతున్నానని సింగర్ మంగ్లీ లేఖలో పేర్కొన్నారు. వైసీపీకి పాడాననే కారణంగానే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఎవరూ తనను పాటలు పాడాలని సంప్రదించకపోయి ఉండొచ్చని తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంతపెద్ద మనిషిని నేను అంతమాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా అని మంగ్లీ లేఖలో ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి తనపై విష ప్రచారం చేస్తున్నారని.. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరమని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవని.. తాను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కానని మంగ్లీ స్పష్టం చేశారు. అందరు నాయకులపై తనకు గౌరవం ఉందని.. తాను హాజరయ్యే కార్యక్రమాలను కేవలం కళాదృష్టితోనే చూడమని విజ్ఞప్తి చేశారు. ఒక కళాకారిణిగా తనకు పాటే అన్నింటికంటే ముఖ్యమన్న సింగర్ మంగ్లీ.. తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో తనకు సంబంధంలేదని, మీ ఇంటి ఆడబిడ్డగా తన పాటను ఆదరించి, ఆశీర్వదించాలంటూ లేఖలో రాసుకొచ్చారు.
సింగర్ మంగ్లీ వివాదం ఏంటి?
రథసప్తమి సందర్భంగా అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని సింగర్ మంగ్లీ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంతో కలిసి వీఐపీ దర్శనం చేసుకున్నారు. అయితే ఇది కొంతమంది టీడీపీ శ్రేణులకు కోపం తెప్చించింది. వైఎస్ జగన్ అభిమాని, ఆ పార్టీకి పాటలు పాడిన మంగ్లీకి ఎలా రాచమర్యాదలు చేస్తారంటూ రామ్మోహన్ నాయుడుపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. అలాగే తన నోటి వెంట చంద్రబాబు అనే పేరు పలకనని చెప్పిన సింగర్ మంగ్లీకి.. టీడీపీ ఎంపీ అయ్యుండి మీరు ఎలా మర్యాదలు చేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa