ఆంధ్ర ప్రదేశ్‌లో ఆరోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికనస్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఐబిఆర్‌డి) ముందుకొచ్చింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలోని ఐబిఆర్‌డి కార్యాలయంలో ఎపి వైద్య,ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు బ్యాంకు ప్రతినిధుల బృందంతొ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రజారోగ్య సేవల నాణ్యతా ప్రమాణాల్ని మరింత మెరుగుపర్చడం ద్వారా చేరువకావడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలోని పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు రాష్ట్ర, జాతీయ స్థాయి నాణ్యతా హామీ ప్రమాణాలు సాధించేందుకు, పిహెచ్‌సిల్లో ప్రయివేటు ప్రొవైడర్లు కల్పించే సేవల్ని మరింత విస్తరింపజేసేందుకు ఈ ప్రోజెక్టు తోడ్పాటునిస్తుంది. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో సేవల నిర్వహణను పర్యవేక్షించేందుకు క్వాలిటీ ట్రాకింగ్ డేష్‌బోర్డును ఏర్పాటు చేయడం, మందులు నిల్వ నిర్వహణా విధానాన్ని మెరుగుపర్చడం ఈ ప్రాజెక్టు ద్వారా వీలవుతుంది. పిహెచ్‌సిల్లో రోగుల సమగ్ర ఆన్‌లైన్ నిర్వహణ విధానాన్ని తీసుకురావడం, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత మందుల పధకాన్ని మెరుగుపర్చేందుకు ప్రైవేట్ ఫార్మసీల ఎంపానల్‌మెంట్ పాలసీని ప్రవేశపెట్టడం, రోగుల పూర్తి స్థాయి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా పేషెంట్ ఫీడ్ బ్యాక్ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజారోగ్య సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. మారుమూల ప్రాంతాల రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇ-సబ్ సెంటర్లలో టెలీ కన్సల్టేషన్, మందులు వంటి సౌకర్యాల్ని కల్పించేందుకు సాంకేతిక ఆధారిత విధానాన్ని తీసుకురావడం, ఎన్‌సిడి స్క్రీనింగ్ కోసం క్లినికల్ ప్రొటోకాల్స్ ప్రవేశపెట్టడం, ఆరోగ్య కేంద్రాల్లో మాతా,శిశు ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చడం వంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేపట్టేందుకు వీలవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa