కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు రహదారి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే చాలా చోట్ల రహదారి విస్తరణ పనులు, బైపాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది.ఈ క్రమంలోనే వైఎస్ఆర్ జిల్లాలోని రాయచోటి చాగలమర్రి జాతీయ రహదారి పనులు కూడా జోరందుకున్నాయి. ఈ ప్రాంతంలో జాతీయ రహదారిని నిర్మించాలని స్థానికులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయచోటి చాగలమర్రి జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం 2021లో మంజూరు చేసింది. 2021 ఫిబ్రవరిలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. చాగలమర్రి నుంచి రాయచోటి మధ్య సుమారుగా 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఈ మార్గంలోని రహదారి కొన్నిచోట్ల 7 మీటర్ల వెడల్పు ఉంటే మరికొన్ని చోట్ల 5.5 మీటర్లు మాత్రమే రోడ్డు ఉంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తేవి. దీంతో రహదారిని విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే రాయచోటి- చాగలమర్రి జాతీయ రహదారి- 440 విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాయచోటి నుంచి లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, వేంపల్లె, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా చాగలమర్రి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రాయచోటి నుంచి వేంపల్లె వరకు రూ.250 కోట్లు, వేంపల్లె నుంచి ప్రొద్దుటూరు వరకు రూ.1000 కోట్లకు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. అయితే నాలుగేళ్ల కిందటే విస్తరణ పనులు మొదలుకాగా.. వివిధ కారణాలతో పనులు జరగలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరటంతో రాయచోటి చాగలమర్రి జాతీయ రహదారి పనుల్లో కదలిక వచ్చింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రహదారి విస్తరణ పనుల్లో జాప్యం గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జిల్లా ఇంఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌లరెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పడంతో రహదారి విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. వంతెనల నిర్మాణం, రోడ్ల పక్కన మట్టి పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 2 నెలల్లో పనులు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |