చాలా మంది చికెన్ ఇష్టంగా తింటారు. కొంతమందికి చికెన్ లేనిదే ముద్దదిగదు. ఇక, ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. అయితే, ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కూర్మా ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదే లే అంటున్నారు. మద్యపాన ప్రియులు మంచింగ్‌కు చికెన్ ఎక్కువ తీసుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.
అయితే, చికెన్ ఆరోగ్యకరమైన మాంసం అయినప్పటికీ, దానిలోని కొన్ని భాగాలు శరీరానికి హానికరం. వీటిని తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయి. అవును, మీరు వింటున్నది నిజమే. కోడి మాంసంలోని కొన్ని భాగాలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమంటున్నారు నిపుణులు. ఆ భాగాలేంటి, అవి ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
కోడి చర్మం
కోడి చర్మంలో చాలా హానికరమైన కొవ్వులు ఉంటాయి. దీని వల్ల మనకు ఎలాంటి పోషకాలు అందవు. కోడి శరీరంలోని ఏదైనా భాగం పూర్తిగా పనికిరానిది అయితే, అది దాని చర్మమే. కోడి ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి కోడి చర్మంపై రసాయనాలను పిచికారీ చేస్తారు చాలా మంది వ్యాపారులు. అందుకే చికెన్ స్కిన్ తినకూడదంటున్నారు నిపుణులు.
చికెన్ స్కిన్ తింటే ఏమవుతుంది?
కోడి చర్మం తినడం వల్ల శరీరంలో హానికరమైన కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే, కోడి చర్మం తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. USDA పరిశోధన ప్రకారం, స్కిన్ లెస్ చికెన్‌లో 231 కేలరీలు ఉంటాయి. అదే కప్పు స్కిన్‌తో వండిన చికెన్‌లో 276 కేలరీలు ఉంటాయి. అంటే చికెన్ స్కిన్‌లో ఒక కప్పుకు ఔన్సుకు 3 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది.
ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
కొంతమందికి చికెన్ స్కిన్ అంటే ఇష్టం అనడంలో సందేహం లేదు. ఇది కూర రుచిని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలా మంది స్కిన్‌తో సహా వండుకుంటారు. కోడి చర్మం తినకపోవడం అంటే దానిని పూర్తిగా నివారించడం కాదు. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు దానిని రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసి.. ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. కానీ చికెన్ స్కిన్ ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోండి. ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం కష్టమవుతుంది.
కోడి తొడలు
ఇక, బ్రాయిలర్ చికెన్ కోడి తొడ భాగాలు కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. బ్రాయిలర్ కోడి తొడ భాగానికి ఇంజెక్షన్ వేస్తారు. కోడి బరువు పెరగడం కోసం ఇలా చేస్తుంటారు. చాలా మందికి చికెన్ తొడ భాగం(చికెన్ లెగ్ పీస్) అంటేనే ఇష్టం. అందుకే ఈ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని కోడి తొడలకు ఇంజెక్షన్స్ ఇస్తారు కొందరు వ్యాపారులు. అప్పుడప్పుడు పెద్ద లెగ్‌పీస్‌లు మనం గమనించే ఉంటాం. ఇలాంటి లెగ్ పీస్‌లు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
కోడి మెడ భాగం
ఇక కొందరు అయితే కోడి మెడ భాగాన్ని కూడా వదిలిపెట్టరు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటుంటారు. అయితే, కోడి మెడ భాగాన్ని కూడా తినకూడదంటున్నారు. కోడి మెడ భాగంలో శోషరస వ్యవస్థ ఉంటుంది. శోషరస వ్యవస్థ శరీరంలోని మలిన వ్యర్థాలు, టాక్సిన్లు, బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంటుంది. అప్పుడప్పుడు ఈ టాక్సిన్ పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదముంది. ఈ భాగాన్ని తినడం వల్ల అందులో ఉండే విషతుల్య పదార్థాలు శరీరంలో చేరి అనారోగ్య సమస్యల్ని కలిగించే అవకాశం ఉంది. అందుకే కోడి మెడను కూడా తినకపోవడమే మేలు.
![]() |
![]() |