వామపక్షాలకు కేటాయించిన సీట్లు పోను నంద్యాల అసెంబ్లీ లోక్‌సభ స్థానం, ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల నుంచి బరిలో దింపేందుకు జనసేన బలమైన అభ్యర్థులకోసం అన్వేషిస్తోంది. సమాజంలో గుర్తింపు ఉండి, వివిధ రంగాల్లో రాణిస్తున్న తటస్థులను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపారు. టీడీపీ, వైసీపీలలో టికెట్ దక్కక నిరాశతో ఉన్న నాయకులతోనూ మంతనాలు సాగిస్తున్నారు. కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో కీలక ప్రజాప్రతినిధి ఒకరితో జనసేన టచ్‌లో ఉంది. నంద్యాల నుంచి ప్రధాన పార్టీ కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మూడు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన కీలక నాయకుడి కుటుంబంతో జనసేన రాష్ట్ర నాయకత్వం రహస్య మంతనాలు సాగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చర్చలు ఫలిస్తే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించవచ్చని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు నుంచి చల్లా వరుణ్, ఆదోని నుంచి మల్లప్ప, ఆళ్లగడ్డ నుంచి శూలం రామకృష్ణ జనసేన టికెట్లు ఆశిస్తున్నారు. మంత్రాలయం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడిని బరిలో దింపేందుకు ఎత్తులు వేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలలో తటస్థుల కోసం జనసేన వేట ముమ్మరం చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోగా కనీసం 50 శాతం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని, ఆ రోజున తొలి జాబితా ప్రకటించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ దిశగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తుల వడబోత జరుగుతోంది. సామాజిక సమీకరణల ఆధారంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. తొలి జాబితాలో జిల్లాలో ఎవరెవరి పేర్లు ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa