కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఓటరు చేర్పులు, జాబితాల సవరణ నిరంతర ప్రక్రియ కావడంతో తాజాగా మరో 4 వేలమంది ఓటర్లు కొత్తగా ఓటు హక్కు పొందారు. దీంతో రెండు జిల్లాల అధికార యంత్రాంగాలు తొలుత అంచనా వేసిన విధంగా ఓటర్ల సంఖ్య 2.50 లక్షలకు సమీపిస్తోంది. పోలింగ్ ఈ నెల 22వ తేదీన జరగనున్న నేపథ్యంలో నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకొన్న వారి అర్జీల పరిష్కారం కొనసాగుతున్న దృష్ట్యా మరోసారి చేర్పులతో తుది ఓటరు జాబితా విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల సంఖ్యని కూడా అధికారులు పెంచుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్నా ఇంకా ఓటర్లు ఫారం-18లను ఆన్‌లైన్‌లో అప్‌లోడింగ్ చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి ఓటుహక్కు కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఓటరు జాబితాలను సవరించుకొంటూ పోతోంది. ఇటీవల ఓటరు జాబితా సవరణ జరిగినప్పుడు రెండు జిల్లాల్లో కలిపి 2,44,635 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కృష్ణ్ణా జిల్లాలో 1,05,037 మంది, గుంటూరులో 1,39,598 మంది ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మరో నాలుగువేల మందికిపైగా ఓటు హక్కు కల్పించారు. దీంతో కృష్ణా జిల్లాలో ఓటర్ల సంఖ్య 1,06,829, గుంటూరులో 1,41,970కి పెరిగింది. ఈ కారణంగా ప్రస్తుతం రెండు జిల్లాల్లో కలుపుకొని మొత్తం ఓటర్లు 2,48,799గా ఉన్నారు. మరో 1200 ఓట్లు పెరిగితే ఈ సంఖ్య రెండున్నర లక్షలకు చేరుకొంటుంది. ఇంకా పోలింగ్ తేదీకి రెండు వారాల గడువు ఉన్నందున కచ్చితంగా ఓటర్ల సంఖ్య పెరుగుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa