ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళ జనజాతరను తలపించింది. రాత్రి పగలు మధ్య విభజన రేఖ చెరిగిపోయి.. నేల ఈనిందా? అన్నట్టు పుణ్య స్నానాలకు భక్తులు తరలివచ్చారు. దీంతో త్రివేణి సంగమం భక్తజనకోటితో పులకించిపోయింది. ఇిక, కుంభమేళా దెబ్బకు అయోధ్య, వారణాసి సహా యూపీలోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామమందిర నిర్మాణం జరిగి.. గతేడాది ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే.
ప్రధానాంశాలు:
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో జరిగిన మహాకుంభమేళా పుణ్యమా అని అయోధ్య సందర్శనకు భక్తులు పోటెత్తారు. నెలన్నర రోజుల నుంచి లక్షలాదిగా తరలిరావడంతో అయోధ్య మున్సిపాల్టీకి పాదరక్షణల సమస్య తలనొప్పిగా మారింది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన పాదరక్షలను తొలగించడానికి మున్సిల్ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వదలిపెట్టిన పాదరక్షలను పొక్లెయిన్లు, ట్రాలీలతో తరలిస్తున్నారు. ఇందుకు ఆలయంలోకి ప్రవేశ, నిష్క్రమణ నిబంధనలు మార్చడమే కారణం. ఆలయ ఎంట్రీ వద్ద ఉన్న మొదటి గేటు వద్ద భక్తుల పాదరక్షలను వదిలిపెడతారు.
ఆలయం లోపల దాదాపు అర కిలోమీటరు మేర ఉన్న వృత్తాకార మార్గాల్లో తిరిగి, దర్శనం తర్వాత మళ్లీ అదే మార్గం నుంచి బయటకు వెళ్తుంటారు. కానీ, కుంభమేళా కారణంగా విపరీతమైన రద్దీ ఏర్పడటంతో దర్శనాలకు వచ్చినవారిని మూడో నెంబరు గేటు నుంచి బయటకు పంపుతున్నారు. మళ్లీ మొదటి గేటు దగ్గరకు వచ్చి చెప్పులు తీసుకోవాలంటే అయిదారు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దీంతో వేలాది మంది తమ పాదరక్షలను తీసుకోవడానికి రకుండా వట్టికాళ్లతోనే వెళ్లిపోతున్నారు. దీంతో ఆ చెప్పులు కుప్పులుగా పోగవుతున్నాయి. వాటిని అక్కడ నుంచి తీసుకెళ్లేందుకు మున్సిపల్ సిబ్బంది పొక్లెయిన్లతో ట్రాలీల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 30 ట్రాలీల్లో పాదరక్షలను తరలించినట్టు అధికారులు తెలిపారు.
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. ‘గత 30 రోజుల నుంచి ఊహించని విధంగా భక్తులు రావడంతో ఎలాంటి గందరగోళం లేకుండా సులభం దర్శనం చేసుకునేలా ఏర్పాట్లలో మార్పులు చేశాం. ’ అని ఆయన అన్నారు. ఇక, కుంభమేళా జరిగిన 45 రోజుల్లో మొత్తం 1.25 కోట్ల మంది భక్తులు అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్నట్టు నివేదికలు చెబుతున్నారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున మొదలైన భక్తుల తాకిడి ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. మహాశివరాత్రి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టారు. జనవరి 26 నుంచి రోజుకు సగటున 10 నుంచి 12 లక్షల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారు. గతేడాది జనవరి 22న అయోధ్య ఆలయం ప్రారంభమైన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa