పెళ్లి కూతురు అంటే.. సుకుమారంగా, సున్నితంగా, మృదువుగా, అందంగా ముస్తాబైన అమ్మాయి రూపాన్ని ఊహించుకుంటాం. నేటి తరం మహిళ అన్ని రంగాల్లో సాధికారత సాధిస్తున్నా.. వివాహం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అమ్మాయి అణుకువతో సాంప్రదాయంగా కనిపించాలనే అభిప్రాయం ఉంది. అయితే, ఈ అభిప్రాయాలను, ఆలోచనలు తలకిందులు చేస్తూ స్త్రీ మానసికంగానే కాదు, శారీరకంగానూ బలవంతురాలనే విషయాన్ని తెలియజెప్పేలా ఓ వధువు తన ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, కృషిని పట్టుదలను ప్రదర్శించింది. ఆమే కర్ణాటకకు చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చిత్రా పురుషోత్తమ్.
సిక్స్ ప్యాక్ బాడీతో ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా అందంగా ముస్తాబైన ఆమె చూపరులందరినీ మురిపించింది. సంప్రదాయ కంచిపట్టు చీర ధరించి.. మెడ నిందుగా నగలను అలంకరించుకుంది. దీంతో పాటు తనలోని బాడీ బిల్డర్‌ను చూపించిందీ ఫిట్‌నెస్ ఫ్రీక్. ప్రస్తుతం బాడీ బిల్డర్, సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది!
కర్ణాటకకు చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చిత్రా పురుషోత్తమ్.. సంప్రదాయంగా ముస్తాబై అతిథులందరి ముందూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి విశేషంగా నిలిచింది. అద్భుతమైన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఫోజులిచ్చింది. తన ఫిట్‌నెస్‌తో సాంప్రదాయ అడ్డుగోడలను బద్దలు కొట్టారని సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. అందానికి తోడు ఫిట్‌నెస్‌తో ఆత్మవిశ్వాసాన్ని జోడించిన వైనం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అటు సాంప్రదాయం, ఇటు సాధికారతను కలగలిపి ‘ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే!’ అన్న సందేశాన్ని ఇచ్చారు. దీనిపై కొందరు నెగెటివ్ కామెంట్లు చేసినప్పటికీ, ఫిట్‌నెస్ కోసం చేసిన ఆమెచేసిన కృషి, సాధించిన బాడీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. చిత్ర ప్రతిభను, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ‘‘ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు ఉండాలి.. ఇలాంటి ధైర్యవంతులైన మహిళలే సమాజానికి స్ఫూర్తి.. ఇదే కదా నిజమైన అందం’ అంటూ చిత్రకు మద్దతు తెలుపుతున్నారు.
ఇక, తన ప్రియుడితో చిత్ర వివాహం త్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రీ-వెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన ఫిట్‌నెస్‌తో ఆమె ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నారు. పసుపు, నీలం రంగు బోర్డర్ ఉన్న కాంజీవరం చీరతో కండలు తిరిగిన దేహాన్ని చిత్ర ప్రదర్శించింది. అలాగే, లేయర్డ్ నెక్లెస్‌లు, కమర్‌బంద్, గాజులు, మాంగ్ టీకా, చెవిదిద్దులు వంటి సాంప్రదాయ బంగారు ఆభరణాలు, ఒటినిండా టాటూలు, జడ గంటలు వేసుకుని, పూలతో వాలుజడను అలంకరించుకున్నారు.
చిత్రా పురుషోత్తం కేవలం బాడీబిల్డరే కాదు మంచి ఫిటినెస్ ట్రైనర్ కూడా. వధువు అలంకరణలో ఉన్న చిత్ర వీడియో వైరల్ కావడం ఇదే కావచ్చు. కానీ ప్రతిభకు మరోపేరుగా వార్తల్లో నిలవడం మాత్రం మొదటిసారి కాదు. మిస్ ఇండియా ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ కర్ణాటక అండ్ మిస్ బెంగళూరు లాంటి అనేక ప్రతిష్టాత్మక పోటీల్లో అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు. తాజా ఫోటోషూట్‌తో మూస దోరణిలను బద్దలు కొట్టి మరీ తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడమే కాదు.. అందం, స్త్రీత్వం సామాజిక ప్రమాణాలను పునర్నిర్వచనం ఇచ్చారు. అంతేకాదు అంత దృడమైన దేహాన్ని సాధించడంలోని తన కృషి పట్టుదల, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. అంతేకాదు, తనలాంటి ఎందరికో చిత్ర ప్రేరణగా నిలుస్తోంది!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa