ఓ వ్యక్తిని ‘మియాం-తియాం’ లేదా ‘పాకిస్థానీ’ అని పిలవడం సరికాదు కానీ, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేంత నేరమైతే కాదని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని ‘పాకిస్థానీ’ అని సంబోధించిన వ్యక్తిపై దాఖలైన కేసు ముగింపు సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి, ఉర్దూ ట్రాన్స్‌లేటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
ఫిర్యాదుదారుడి ప్రకారం.. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుతూ దరఖాస్తు ఇచ్చిన సమయంలో... నిందితుడు అతడి మతాన్ని ప్రస్తావిస్తూ దుర్భాషలాడాడు.. అధికారిక విధులను నిర్వర్తించకుండా నిరోధించేలా నేరపూరిత చర్యలకు పాల్పడ్డాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించాడని పేర్కొంటూ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 298, 504, 353 తదితర సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. కానీ, ఉన్నత న్యాయస్థానం అతడి అభ్యర్థనను తిరస్కరించింది.
దీంతో అతడు సుప్రీంకోర్టు తలుపుతట్టగా.. తాజాగా అక్కడ ఊరట లభించింది. ఝార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘‘మియాన్-తియాన్’, ‘పాకిస్థాన్’ అంటూ అని పిలవడం ద్వారా మతపరమైన భావాలను దెబ్బతీశాడని ఫిర్యాదుదారు ఆరోపించారు... అలాంటి వ్యాఖ్యలు నిస్సందేహంగా చెడు అభిరుచే... అయితే, ఇది సమాచారం ఇచ్చిన వ్యక్తి మతపరమైన భావాలను దెబ్బతీసినట్లు కాదు’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇందులో ప్రశాంతతకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ఎలాంటి చర్యలు లేవని స్పష్టంగా పేర్కొంది.
‘‘నిందితుడిపై స్పష్టంగా ఐపీసీ సెక్షన్ 353 ( ప్రభుత్వ ఉద్యోగుల విధులను నిరోధించడం లేదా క్రిమినల్ ఫోర్స్)ను ప్రయోగించడానికి అతడు ఎటువంటి దాడి లేదా బలప్రయోగం చేయలేదు.’’ అని తేల్చిచెప్పింది. నిందితుడు హరి నందన్ సింగ్.. ఆర్టీఐ కింద అడిషినల్ కలెక్టర్ నుంచి సమాచారం కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేయడానికి వెళ్లాడు. ఈ సమయంలో ఉర్తూ ట్రాన్స్‌లేటర్‌తో వాగ్వాదం చోటుచేసుకోగా.. అతడ్ని అసభ్య పదజాలంతో దూషించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa