నువ్వొకటంటే .. నేరొండంటా.. సామెత డేటా విషయంలో సరిగ్గా సరిపోతుంది. డేటా చోరీపై తెలంగాణ సర్కారు ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రెండు సిట్ బృందాలను రంగంలోకి దింపింది. ఎస్సార్ నగర్ ఠాణాలో దినేష్‌చౌదరి అనే టీఆర్ ఎస్ కార్యకర్త తమ సర్కారును తీవ్రవాదులతో పోల్చాడంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఫిర్యాదు చేశారు. ఏపీ, తెలంగాణ సమాచారం ఐటీ గ్రిడ్స్ లో ఉందంటూ సిట్ బృంద సారధి ఐటీ స్టీఫెన్ రవీంద్ర సెలవిచ్చారు. రెండు తెలుగు రాష్ట్ర నేతల మధ్య తగాదా కాస్తా ముదిరి పాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను తలపిస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే ఏపీ, టీఎస్ పోలీసు బలగాలు ఎవరి రాష్ట్రంలో వారే ఉంటూ దర్యాప్తు చేస్తున్నారు. పైగా.. డేటా చోరీ జరిగింది.. హైదరాబాద్‌లో ప్రధాన నిందితుడు దాగుంది విజయవాడలో.. మరి ఈ రెండింటికీ కలిపెదేలా. ఇరు రాష్ట్ర పోలీసుల మధ్య సఖ్యత అంతంతమాత్రమే. పైగా తెలంగాణ ఉద్యమం నాటి బావోద్వేగాలు.. ఇక్కడి ప్రజల్లో ఇప్పటికీ ఉండనే ఉన్నాయి. రాష్ట్ర విభజనతో మనోవేదన అనుభవించిన ఆంధ్ర పౌరుల కోపతాపాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన సమయంలో డేటా పేరిట.. ఇరు రాష్ట్ర ప్రజల మధ్య యుద్ధంగా మార్చేందుకు టీడీపీ, టీఆర్ ఎస్ రెండూ శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దరిదాపుల్లో ఎన్నికలు లేనట్టయితే ఈ గొడవ సామరస్యంగా పరిష్కారమయ్యేది. లేకపోతే.. ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించేవారు. కానీ.. మరో నెల, రెండు నెలల్లో ఎన్నికలు.. దీనికోసం ఇరు పార్టీలు వీలైనంతగా జనంలో సెంటిమెంట్ రగిలించి.. సానుభూతి సంపాదించాలనే తపన కనిపిస్తుందంటూ విపక్షాలు స్పష్టంచేస్తున్నాయి. నిందితుడు అశోక్ ఏపీలో కాదుకదా.. అమెరికాలో దాగినా పట్టుకొస్తామంటూ తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. నేడో.. రేపో తప్పకుండా అశోక్‌ను అరెస్ట్ చేయటం ఖాయమని సమాచారం. అతడు ఏపీలో దాగినట్టయితే అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావటం అంత తేలికగా కనిపించట్లేదు. దీనికి ఏపీ సర్కారు ఎంత వరకూ సహకరిస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీఆర్ ఎస్, టీడీపీ రెండింటికీ టెక్నాలజీ అందించిన ఐటీ కంపెనీలకు మాత్రం ఇది ఆందోళన కలిగిస్తుందట. దీంతో టీఆర్ ఎస్ తమ పార్టీ యాప్‌ను మూసివేసింది. టీడీపీ ఏకంగా వెబ్‌సైట్‌ను ఎర్రర్ అంటూ ప్రకటించింది. ఈ లెక్కన.. దొంగాటలో ఇరు పార్టీల ప్రమేయం ఉందనే అనుమానాలు లేకపోలేదు. దీనివల్ల ఏ పార్టీ లాభపడుతుందనేది పక్కనబెడితే.. ఏపీలో ఇదంతా కేసీఆర్ నడిపిన పన్నాగం అనే ముద్ర పడితే.. జగన్ మరోసారి ప్రతిపక్షనాయకుడిగా పరిమితం అవుతాడనే భయం కూడా వైసీపీలో వినిపిస్తోంది. మరి దీన్నుంచి బయటపడి.. ఎవరు హీరో అనిపించుకుంటారో.. ఎవరు జీరోగా మారతారనేది మరి కొద్దిరోజుల్లో కానీ తెలియదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa