ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడులో టీడీపీ పందెం కోళ్లు ఇవే..! కోడెల స్థానం ఖరారు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 07:59 PM

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు ఓ అభిప్రాయానికి వచ్చారు. లోక్‌సభ పరిధిలో వినుకొండ, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో మాచర్ల, నరసరావుపేటల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన అయిదింటిని, లోక్‌సభ స్థానాన్నీ తెదేపా చేజిక్కించుకొని పల్నాడుపై పట్టు సాధించింది. రాబోయే ఎన్నికల్లో లోక్‌సభతోపాటు ఏడు నియోజకవర్గాల్లోనూ జయకేతనం ఎగురవేయాలని అధినేత చంద్రబాబునాయుడు పలుమార్లు నేతలకు సూచించారు. గురజాలకు యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండకు జీవీఎస్‌ ఆంజనేయులు, పెదకూరపాడుకు కొమ్మాలపాటి శ్రీధర్‌, చిలకలూరిపేటకు ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తుండగా వీరందరికీ మరోసారి పోటీచేసే అవకాశం ఖాయం. పత్తిపాటి పుల్లారావు అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం యడ్లపాడు మండలంలోని బోయపాలెం, ఉప్పరపాలెం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. యరపతినేని శ్రీనివాసరావు కూడా నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా నరసరావుపేటను బీజేపీకి కేటాయించగా ఆ పార్టీ తరఫున రంగంలోకి దిగిన నల్లమోతు వెంకట్రావు వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నరసరావుపేటలోని పొత్తు కారణంగా తన సొంత మండలం నకరికల్లు ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్‌ నేత డాక్టరు కోడెల శివప్రసాదరావు పోటీచేసి గెలిచారు. తన నియోజకవర్గంతోపాటు నరసరావుపేటకు కూడా నిధులు తీసుకువచ్చి పెద్దఎత్తున ప్రగతి కార్యక్రమాలు చేపట్టారు.
రెండు నియోజకవర్గాల్లోనూ అనుచరులు ఉన్నందున ఈసారి ఎక్కడి నుంచి రంగంలోకి దిగుతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడ నుంచి ఎన్నికల బరిలోకి దిగినా రెండు నియోజకవర్గాల్లో తెదేపాను గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందని మాత్రం చెబుతున్నారు. ఆయన పోటీపై స్పష్టత వస్తే మిగిలిన స్థానంలో అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరగనుంది. ఇక్కడి నుంచి పలువురు ఆశావహులు సీటు ఆశిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో ప్రతిసారీ జాప్యం చేయడం, చివరి క్షణంలో ప్రకటిస్తుండటంతో కార్యకర్తలు, నేతలను సమన్వయం చేసుకుని సమర్థంగా ప్రత్యర్థి పార్టీకి ధీటుగా ముందుకెళ్లలేక అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారు. గత ఎన్నికలకు ముందు జరిగిన పురపాలక ఎన్నికల్లో మాచర్ల పట్టణంలో తెదేపా కౌన్సిలర్లే ఎక్కువ మంది గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈసారి ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే గెలుపు దిశగా పయనించవచ్చని శ్రేణులు భావిస్తున్నాయి. అక్కడ్నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa