ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంత‌ మూడు స్థానాల్లో వీడని ఉత్కంఠ‍

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 08:53 PM

జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ఖరారు ఒక కొలిక్కి వచ్చింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో 11 స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మూడు స్థానాల్లో మాత్రం ఇంకా ఉత్కంఠ వీడలేదు. బుధ, గురువారాల్లో జరిగిన జిల్లా నియోజకవర్గాల సమీక్షలో తొలిరోజు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వీటిలో రాయదుర్గం అభ్యర్థిగా మంత్రి కాలవ శ్రీనివాసులు, రాప్తాడుకు మంత్రి పరిటాల సునీత, అనంతపురానికి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, ధర్మవరానికి గోనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురానికి నందమూరి బాలకృష్ణ, మడకశిరకు ఈరన్న, కదిరికి కందికుంట వెంకటప్రసాద్‌, పుట్టపర్తికి పల్లె రఘునాథరెడ్డి, తాడిపత్రికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి అభ్యర్థులుగా బరిలో దించడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. వీరిలో ఏడుగురు సిట్టింగులకు అకాశం కల్పించారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌, తాడిపత్రిలో అస్మిత్‌రెడ్డి ఈసారి టీడీపీ అభ్యర్థులుగా నిలిచే అవకాశాలున్నాయి. రెండోరోజు ముందుగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఆ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ నిమ్మల కిష్టప్పకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తరువాత కదిరిలో కందికుంటకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే చాంద్‌బాషా ను పార్టీ విజయం కోసం పనిచేయాలని, ఆయన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో హిందూపురం నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంటు స్థానానికి అభ్యర్థుల పేర్లు ప్రకటించినట్లైంది. అర్ధరాత్రి తరువాత అనంతపురం పార్లమెంటు స్థానం సమీక్షించారు. ముందుగా రాయదుర్గం నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజును సీఎం పిలిపించుకున్నారు. కాలవ శ్రీనివాసులు విజయానికి కలిసి పనిచేయాలని వారికి చెప్పారు. మెట్టు గోవిందరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉరవకొండ నుంచి శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ను, అనంతపురం నుంచి ప్రభాకర్‌ చౌదరిని బరిలో దింపడానికి సీఎం సుముఖత వ్యక్తం చేశారు. మిగిలిన మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో ఉంచారు.
ఇన్‌చార్జ్‌ మంత్రి దేవినేని ఎదుట ఉన్నం తిరుగుబావుటా..కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరితో సీఎం చంద్ర బాబు గురువారం రాత్రి మాట్లాడుతూ ఆ నియోజకవర్గంలోని పరిస్థితిపై అభిప్రాయాలతో కూడిన నివేదిక ఉన్న ఒక సీల్డ్‌ కవర్‌ అందించినట్టు సమాచారం. తాను జిల్లాకు వచ్చిన సమయంలో హనుమంతరాయచౌదరికి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని వివరించానని, ఎమ్మెల్యే తనయుడు మారుతీచౌదరి స్పీడుతో వచ్చిన వ్యతిరేకత దెబ్బతీస్తుందని హెచ్చరించానని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. దీంతో తమకు సీటు ఇవ్వరని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, ఆయన తనయుడు మారుతీ చౌదరితో పాటు వారి వర్గీయులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం నుంచీ వారు టీడీపీ రాష్ట్ర ముఖ్య నేతలను కలిసి తమ రాజకీయ భవిష్యత్తు గురించి అడిగినట్టు తెలిసింది. అక్కడే ఉన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి తమకు మళ్లీ అవకాశం కల్పించాలని అడిగినట్టు సమాచారం. దీంతో ఆయన స్పందిస్తూ కళ్యాణదుర్గంపై సీఎం చంద్రబాబుకు సమగ్ర అవగాహన ఉందని, తాను సిఫార్సు చేసే పరిస్థితి లేదని వివరించినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు తాము స్వతంత్రంగా బరిలో దిగుతామని దేవినేనితో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మంత్రి దేవినేని వద్దనే ఉన్న ఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ అధినేత సురేంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. దీంతో కళ్యాణదుర్గం సీటుకు ప్రధానంగా సురేంద్రబాబు పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం వ్యతిరేకవర్గం కూడా అమరావతి నుంచి కళ్యాణదుర్గం వెళ్లిపోయింది. వారిలో కొందరు పరిటాల శ్రీరాంకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో కళ్యాణదుర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి అనుకూలంగా, మంత్రి దేవినేనికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులు విమర్శలకు దారితీశాయి. మంత్రి దేవినేనికి రూ. 15 కోట్లు ఇచ్చి సురేంద్రబాబు సీటు కొనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వాట్సాప్‌ పోస్టింగులు హల్‌చల్‌ చేశాయి. దీంతో దేవినేని తన అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లండి అంటూ స్పందించినట్టు సమాచారం.
శింగనమల, గుంతకల్లుపై కసరత్తు-శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల అభ్యర్థులపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం కూడా వాటిపై స్పష్టత రాలేదు. శింగనమల సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీబాలకే అవకాశం కల్పించాలని ఆమె తల్లి, ఎమ్మెల్సీ శమంతకమణి సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. కానీ ఇందుకు ఆయన సుమఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఈ సీటుకు మాజీ మంత్రి శైలజానాథ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరలేదు. దీంతో ఆ నియోజకవర్గంలో టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణితోపాటు ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంఘం నుంచి రవిశంకర్‌, పారిశ్రామికవేత్త కంబగిరి రాముడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గుంతకల్లు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు సర్వే నివేదికలు అనుకూలంగా లేవని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఈ సీటుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్త పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో వెంకటశివుడు యాదవ్‌ను జిల్లాకు చెందిన ప్రముఖ నేతలతోపాటు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా సిఫార్సు చేసినట్టు తెలిసింది. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పితాని సత్యనారాయణ మాత్రం మధుసూదన్‌ గుప్త పేరు సూచించినట్టు సమాచారం.
పలుచోట్ల సీట్ల సంబరాలు-జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఖరారైన పలు నియోజకవర్గాల్లో శుక్రవారం సంబరాలు జరిగాయి. వాటిలో ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు నియోజకవర్గ ప్రజలు భారీగా స్వాగతం పలికారు. కదిరిలో కందికుంట వెంకటప్రసాద్‌కు అవకాశం కల్పించడంపై నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. అనంతపురం నియోజకవర్గంలో కూడా ప్రభాకర్‌ చౌదరికి మళ్లీ అవకాశం కల్పించడంపై ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa