ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపపై కొనసాగుతున్న ఉత్కంఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 08:48 PM

జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుసార్లు అధినేత చంద్రబాబు ఆ మూడు నియోజకవర్గాల నేతలతో చర్చలు జరిపి ఓ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆశావహులు మాత్రం వెనక్కి తగ్గకుండా ఈసారి టికెట్‌ ఇస్తే సరి.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ తేల్చి చెబుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక బాధ్యత మంత్రి ఆదినారాయణరెడ్డికి అప్పజెప్పినట్లు సమాచారం. కాగా ప్రొద్దుటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికే టికెట్‌ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బద్వేలులో లాజరస్‌, డాక్టర్‌ రాజశేఖర్‌ల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కడప అభ్యర్థిత్వంపై పంచాయతీ వీడకపోవడంతో కొత్తగా ఒకటి, రెండు పేర్లు పరిశీలిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
మంత్రి ఆదిదే బాధ్యత-కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు బాధ్యతను అప్పజెప్పారు. పులివెందులకు సతీ్‌షకుమార్‌రెడ్డి, జమ్మలమడుగుకు రామసుబ్బారెడ్డి, మైదుకూరుకు టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, కమలాపురానికి పుత్తా నరసింహారెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించడంతో వారు ప్రచారాలు మొదలుపెట్టారు. ఎంపీ అభ్యర్థి గెలుపు సాధించాలంటే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలన్న ఆలోచన మంత్రి ఆది చేస్తున్నట్లు సమాచారం. దీంతో మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో కొంత జాప్యం వస్తోంది. ప్రొద్దుటూరు నుంచి మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి పోటీ పడుతుండగా ఈ ఇద్దరు నేతలకు జిల్లాలోని ముఖ్య నేతలు మద్దతునిస్తున్నారు. పలు సందర్భాల్లో ఈ ఇద్దరు నేతలతో సీఎం సమావేశమై చర్చించినా టికెట్ల పంచాయితీ తెగలేదు, దీంతో మంత్రి ఆదికి ఈ బాధ్యత అప్పగించి ఇద్దరిలో ఏకాభిపాయ్రం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మంత్రి ఆది చర్చించినా ఇద్దరు నేతలు పట్టుబడుతూ నాకే టికెట్‌ లేదంటే పోటీ చేస్తానంటూ తేల్చి చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా వరదరాజులరెడ్డికే ఖరారు అవుతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నాయి. మరో రెండురోజుల్లో అధికారికగా ప్రకటించే అవకాశం ఉంది. తెర వెనుక మంత్రి ఆది వ్యూహంతోనే వరదరాజులరెడ్డికి టికెట్‌ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. బద్వేలు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచించే వ్యక్తికి టికెట్‌ ఇస్తామని మంత్రి ఆది పలు సందర్భాల్లో ప్రకటించారు. దీంతో విజయమ్మ లాజరస్‌, డాక్టర్‌ రాజశేఖర్‌ పేర్లను అధిష్ఠానం ముందు పెట్టి ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సరేనంటూ పేర్కొన్నారు. మేం చెప్పాల్సింది చెప్పాం, ఇక అధిష్ఠానం నిర్ణయం, ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి ప్రయత్నిస్తోంది. వివిధ సర్వేలతో గెలుపు అభ్యర్థి ఎవరన్నది సీఎం చంద్రబాబు గుర్తించి అధికారికంగా మూడురోజుల తరువాత ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కడపలో ఉత్కంఠ-కడప టీడీపీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. మాజీ మంత్రి అహ్మదుల్లా పార్టీలో చేరినప్పుడు ఆయన తనయుడు అష్ర్‌ఫకు ఇన్‌ఛార్జ్‌ అవకాశమిచ్చారు. కడప అసెంబ్లీ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలనే ఆలోచనతో అష్రఫ్‌ అభ్యర్థంటూ ప్రచారం సాగింది. కానీ మంత్రి ఆది ఇందుకు అడ్డుపుల్ల వేసినట్లు మరో కొన్ని పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నేత అమీర్‌బాబు, డాక్టర్‌ మహబూబ్‌ పీరా పేర్లను తాజాగా పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని కడప నుంచి పోటీ చేయాలని పార్టీ పెద్దలు కోరుతున్నారు. కానీ ముస్లింలకు కడప సీటు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు నాన్‌ మైనార్టీ్‌సకు టికెట్‌ ఇస్తే ముస్లింల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని లాభం కన్నా నష్టమేనని భావన పార్టీలో వినిపిస్తోంది. అందుకనే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తనకు రాజంపేట ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. మంత్రి ఆది ఆలోచనలు, సూచనలతో ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు కానున్నారు. మిగిలిన నేతలు ఎవరూ కూడా జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంపీగా పోటీ చేస్తుండడంతో పాటు గెలుపు వ్యూహంతో వెళుతున్న మంత్రి ఆదికి అభ్యర్థుల ఎంపికలో సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa