జిల్లాలో వైసీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. ప్రధానంగా మైలవరం, పెడన, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో లుకలుకలు తారస్థాయికి చేరాయి. సీటు రాకపోతే అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పని చేస్తామని ఆపార్టీ అసమ్మతి నేతలు అంటున్నారు. టికెట్లు ఖరారు చేయకముందే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, పశ్చిమ నుంచి వెలంపల్లి శ్రీనివాస్, తూర్పు నుంచి యలమంచిలి రవి పేర్లు వినిపిస్తున్నాయి. వారికి ఈ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల నుంచే సహాయనిరాకరణ ఎదురవుతోంది. సెంట్రల్ టికెట్ ఆశించిన వంగవీటి రాధాకు మొండిచేయి చూపడంతో ఆయన పార్టీని వీడారు. దీంతో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు వ్యతిరేకంగా రాధా అనుచరులు పనిచేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ వెలంపల్లితోపాటు కోరాడ విజయకుమార్ వైసీపీ సీటు ఆశిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే వెలంపల్లి ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని కోరాడు చెబుతున్నారు. తూర్పులో యలమంచిలి రవితోపాటు బొప్పన భవకుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.
గన్నవరం, పెనమలూరులో గందరగోళం-గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావుకు వైసీపీ టికెట్ ఖాయమని తొలుత ప్రచారం జరిగింది. తాజాగా అధికార పార్టీ నుంచి వచ్చే ఓ ఎమ్మెల్యేకు గన్నవరం టికెట్ దాదాపు ఖరారైందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ పార్టీ అధిష్ఠానమే వ్యూహాత్మ కంగా తెరపైకి తెచ్చిందని సమాచారం. వెంకట్రావుకు టికెట్ ఇవ్వకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన వారిని ఇక్కడ పోటీకి నిలబెట్టాలని అధిష్ఠానం భావిస్తోంది. పెనమలూరు నుంచి పార్థసారథిని కూడా మార్చవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
పెడనలో గరంగరం..! పెడన నియోజకర్గంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఉప్పాల రాంప్రసాద్‌కు టికెట్ దాదాపు ఖాయమని అంతా భావించారు. చివరి నిమిషంలో ఆ స్థానం నుంచి జోగి రమేష్‌ను బరిలోకి దించాలని జగన్ నిర్ణయించారు. 2014 ఎన్నికల సమయంలోనూ జగన్ ఆదేశం మేరకు ఉప్పాల పెడన నియోజకవర్గాన్ని త్యాగం చేసి కైకలూరు నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. తాజాగా తనకు మరోసారి జగన్ మొండిచేయి చూపుతున్నారని ఉప్పాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాల వర్గం చివరి నిమిషంలోనైనా టికెట్ తమకు దక్కుతుందన్న ఆశతో ఉంది. టికెట్ ఇవ్వకపోతే జోగి రమేష్ ఓటమే లక్ష్యంగా పని చేయాలని ఉప్పాల వర్గం పట్టుదలతో ఉంది. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఉప్పాల టీడీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారన్న ప్రచారమూ ఉంది.
మైలవరంలో వర్గపోరు షురూ..! మైలవరం నుంచి ఆర్థికంగా బలమైన వసంత కృష్ణప్రసాద్‌ను వైసీపీ బరిలోకి దింపింది. గత ఎన్నికల నుంచి ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న జోగి రమేష్‌కు స్థానచలనం తప్పలేదు. ఇక్కడ వైసీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వసంత రాకతో గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన పాత తరం వారంతా వైసీపీలోకి వచ్చారు. వీరు ఒక వర్గంగా కొనసాగుతున్నారు. జోగి రమేష్ ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో ఆయనతోపాటు పనిచేసిన వారంతా మరో వర్గంగా ఉన్నారు. కృష్ణప్రసాద్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని రమేష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో వారంతా జోగి రమేష్ ఓటమికి పనిచేశారని, అలాంటి నమ్మకద్రోహులకు వసంత ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు వర్గాల నడుమ పోరు ముదురుతోంది. రమేష్ వర్గంలోని అధికశాతం మంది పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa