రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరాడ ఫౌండేషన్ ఛైర్మన్ కోరాడ విజయ్‌కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన రోజువారీ సాగిస్తున్న పాదయాత్రలో భాగంగా శనివారం ఉదయం 8 నుండి 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు 28వ డివిజన్‌లోని స్థానిక యువకులు మెండు అశోక్, రవూఫ్, రూపేష్‌ల ఆధ్వర్యంలో పాదయాత్ర సాగించారు. డివిజన్‌లోని బ్యాంక్‌సెంటర్, స్వాతిసెంటర్, అవుట్ ఏజెన్సీ, క్రాంబ్వేరోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. పలుచోట్ల భవన నిర్మాణాలు సాగుతున్న ప్రాంతంలో కార్మికులతో కలిసి స్వయంగా కూలిపని చేశారు. అదేవిధంగా వైద్య ఖర్చుల నిమిత్తం డివిజన్‌కు చెందిన కె.కేశవరావు, పి.ఆదిలక్ష్మీ, జి.నరసింహరావు, సత్య సైదాలతో పాటు ఒంటరి జీవితం గడుపుతున్న ఎ.సన్యాసమ్మ, దేవుడమ్మ తదితర 20 మంది మహిళలకు ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా కోరాడ విజయ్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ డివిజన్ చూసినా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందన్నారు. కనీసం స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే భవానీపురంలోని పలు ప్రాంతాలు ఇంకా అస్థవ్యస్థమైన డ్రైయిన్లు, పూడికలు తీయని కాల్వలు, చెత్తాచెదారంతో నిండిన ఖాళీస్థలాలతో దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్తితి నేపధ్యంలో స్థానికంగా నివాసం ఉండేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తన వద్ద పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్ల పట్టాలు లేవని స్థానికులు చెబుతున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో అధిక జనాబా కల్గిన భవానీపురం ప్రాంతంలో పరిస్తితే ఇలా ఉంటే మిగిలిన డివిజన్ల సంగతేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందడం తధ్యమని జోస్యం చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే డివిజన్‌లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా పలుచోట్ల మహిళలు కోరాడ విజయ్‌కుమార్‌కు హారతులు పట్టారు. కార్యక్రమంలో నాయకులు బాడిత శంకర్, పోతిన బేసుకంటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa