రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైయస్‌ఆర్‌సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైయస్‌ఆర్‌సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి, వైయస్‌ఆర్‌సీపీ వారికి ఏ పనీ చేయకూడదు, అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు.
![]() |
![]() |