వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చేప కొరడంతో గాయమైన అరచేతిని వైద్యులు తొలగించారు. ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యులు తెలిపారు. కేరళలోని కన్నూరు జిల్లాలో జరిగిందీ ఘటన. థలస్సెరికి చెందిన రైతు టి.రాజేశ్ (38) ఫిబ్రవరి 10న తన పొలంలోని చెరువును శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘కడు’ రకం చేప కొరకడంతో రాజేశ్ కుడి చేతివేలికి గాయమైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన రాజేశ్ గాయానికి వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గకపోగా అరచేతిపై బొబ్బలు వచ్చాయి. దీంతో మరోమారు ఆసుపత్రికి వెళ్తే వైద్యులు రకరకాల పరీక్షలు చేసి ‘గ్యాస్ గ్యాంగ్రీన్’ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు తేల్చారు. దాని నుంచి బయటపడాలంటే వ్యాధి వ్యాపించిన భాగాన్ని తొలగించడం తప్ప మరోమార్గం లేకపోవడంతో తొలుత చేతి వేళ్లను తొలగించారు. ఆ తర్వాత అరచేతిని పూర్తిగా తొలగించారు.ఇసుక, బురద నీటిలో కనిపించే ‘క్లోస్ట్రిడియం పెర్పింజెన్స్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా కనుక మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా అరచేతిని పూర్తిగా తొలగించినట్టు వివరించారు. లక్షమందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేశ్ ఒకరు కావడం గమనార్హం.
![]() |
![]() |