ఈ రోజు హోలీ పండుగ కావడం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవు ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల పోటెత్తారు. గురువారం రాత్రి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుని ఈ రోజు ఉదయం దర్శనం కోసం బారులుతీరారు.దీంతో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు.. స్వామివారిని 51,148 మంది భక్తులు దర్శించుకున్నారు.వీరిలో 21,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో నిన్న ఒక్కరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.3.56 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ రేపు భక్తుల రద్దీ విపరీతంగా ఉండనుండటంతో.. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం పూట వర్షాలు, పగటిపూట భారీగా ఎండలు కొడుతుండటంతో.. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |