రైలు హైజాక్ ఆపరేషన్‌పై పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఆరోపించింది. పాక్ దళాలతో యుద్ధం కొనసాగుతోందని, పాక్ వైపు భారీ నష్టం జరిగిందని తెలిపింది. పాక్ సైన్యం గెలవలేదని, బందీలు తమ వద్దే ఉన్నారని పేర్కొంది. కాగా, బలూచిస్థాన్ ప్రావిన్సులోని క్వెట్టా నుంచి సమస్యాత్మక ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన మిలిటెంట్లు 9 బోగీల్లో 400 మందికిపైగా ఉన్న ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పాక్ ఆర్మీ హైజాకర్లను హతమార్చామని, బందీలను రక్షించామని ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో 21 మంది ప్రయాణికులు, నలుగురు పాకిస్థానీ సైనికులు కూడా మృతి చెందారని తెలిపింది. అలాగే, 33 మంది తీవ్రవాదులను కాల్చి చంపామని పేర్కొంది. పాక్ ఆర్మీ ప్రకటనపై తాజాగా స్పందించిన బీఎల్ఏ.. పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. పాక్ ఆర్మీతో ఇంకా పోరు కొనసాగుతోందని తెలిపింది. తాము ఖైదీల మార్పిడికి ప్రతిపాదించామని, కానీ చర్చలకు నిరాకరించిన పాక్ తమ సైనికులను గాలికి వదిలేసిందని ఆరోపించింది. అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు స్వతంత్ర జర్నలిస్టులను పంపాలని ప్రతిపాదించింది. మరోవైపు, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనలో ఆప్ఘనిస్థాన్ తీవ్రవాదుల ప్రమేయం ఉందన్న పాక్ ఆరోపణలను తాలిబన్ ప్రభుత్వం ఖండించింది.
![]() |
![]() |