జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పోటాపోటీగా వేలాది మందికి భోజనాలు పెట్టారు. ఎక్కడిక్కడ మజ్జిగ, తాగునీరు, ఓఆర్‌ఎ్‌సలు, టన్నుల కొద్దీ పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేశారు. సభకు తెలుగురాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు. గురువారం రాత్రికే పిఠాపురం, గొల్లప్రోలుతోపాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్న ఇతర ప్రాంతాల వారికి స్థానిక జనసేన నేతలు భోజన సదుపాయాలు ఏర్పాటుచేశారు. శుక్రవారం ఉదయం నుంచి కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216 హైవే, పిఠాపురం-సామర్లకోట, బీచ్ రోడ్డు, పిఠాపురం పట్టణం, చిత్రాడకు వచ్చే అన్ని మార్గాల్లో పదుల సంఖ్యలో భోజనాల కౌంటర్లు ఏర్పాటుచేశారు. నియోజకవర్గ పరిధిలో 4 భోజన కేంద్రాలే ఏర్పాటు చేస్తున్నామని ముందు చెప్పినా, స్వచ్ఛందంగా పార్టీ నాయకులు ముందుకొచ్చి భోజనాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు వారి వాహనాలు, ట్రైసైకిల్స్‌కు వద్దకు వెళ్లి భోజనాలు అందజేశారు. మజ్జిగ, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, పాలు పంపిణీకి భారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అందజేస్తూనే ఉన్నారు. తిరిగి వెళ్లేవారికి బస్సులు, ఇతర వాహనాల్లో భోజన ప్యాకెట్లు అందించారు. సభా ప్రాంగణానికి వెళ్లే దారుల్లో పుచ్చకాయలు అందజేశారు. సభ లోపల బిస్కెట్లు, మజ్జిగ, తాగునీరు నిరంతరాయంగా అందించారు.
![]() |
![]() |