ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ కో ఛైర్‌గా భారత్‌ను తొలగించాలని పాకిస్థాన్‌ అభ్యర్థన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 01:49 PM

ఇస్లామాబాద్‌: ఉగ్రసంస్థల ఆర్థిక మూలాలపై నిఘా ఉంచే ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌)లోని ఆసియా-పసిఫిక్‌ జాయింట్‌ గ్రూప్‌ కో ఛైర్‌గా భారత్‌ను తొలగించాలని కోరినట్లు పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉగ్రవాద ఆర్థిక వనరులను కట్టడి చేయడంలో పాకిస్థాన్‌ విఫలమైందని పేర్కొన్న ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే పటిష్ఠ చర్యలు తీసుకోని పక్షంలో తదుపరి సమీక్షలో బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చుతామని కూడా హెచ్చరించింది. అందులో భాగంగా పాకిస్థాన్‌ ఇటీవల నిషేధిత సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యల ఆధారంగా పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచాలా లేదా బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలా అన్న దానిపై వచ్చే జూన్‌లో సమీక్ష జరగనుంది.ఈ నేపథ్యంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షునికి పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి అసద్‌ ఉమర్ ఓ లేఖ రాశారు. ‘‘భారత్‌ స్థానంలో ఆసియా-పసిఫిక్‌ జాయింట్‌ గ్రూప్‌ కోఛైర్‌గా వేరే దేశాన్ని నియమించాలి. సమీక్ష నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఈ అభ్యర్థనను ఎఫ్‌ఏటీఎఫ్‌ ముందుంచుతున్నాం. పాక్‌పై భారత్‌ వైఖరి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో పరిస్థితులు మరింత దిగజారాయి. 


ఫిబ్రవరి 18న జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశంలో పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలో సమీక్షా విభాగంలో భారత్‌ ఉంటే ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలన్న స్ఫూర్తికి విఘాతం కలిగే అవకాశం ఉంది. పాక్‌ పట్ల భారత్‌ ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తుందని మేం బలంగా విశ్వసిస్తున్నాం’’ అని లేఖలో ఉమర్‌ రాసుకొచ్చారు.ఎఫ్‌ఏటీఎఫ్‌ విభాగమైన ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ రివ్యూ గ్రూప్‌(ఐసీఆర్‌జీ)లో ఆసియా-పసిఫిక్‌ జాయింట్‌ గ్రూప్‌ ఓ భాగం. ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌లోని సభ్యదేశాల సమీక్షలు జరిపే బాధ్యత దీనిపై ఉంటుంది. దీనికి భారత ఫైనాన్షియల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కోఛైర్‌గా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచడం వల్ల అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహకారం అందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌ ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కాలని ప్రయత్నిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa