కర్నూలులో టీడీపీ నేత హత్య కలకలం రేపింది. నగరంలోని శరీన్‌నగర్‌లో నివాసం ఉండే చెందిన మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి కోశపోగు సంజన్నను దారుణంగా చంపారు. సంజన్నను శుక్రవారం రాత్రి అదే కాలనీలో దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. సంజన్న సీపీఎంలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు.. కార్పొరేటర్‌గా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి కుమారుడు జయరాంను కార్పొరేటర్‌గా పోటీ చేయించగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు అప్పటి వైఎస్సార్‌సీపీ కాటసానితో విభేదాలతో టీడీపీలో చేరి బైరెడ్డి అనుచరుడిగా ఉన్నారు.
కొంతకాలంగా శరీన్‌నగర్‌లో రౌడీషీటర్ వడ్డె రామాంజనేయులు సంజన్న మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కొంతకాలంగా ఇరువర్గాల మధ్య దాడి ఘటనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కాలనీలోని గుడికల్ అలిపిరా స్వామి భజన కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా సంజన్నపై దుండగులు కత్తులతో దాడి చేశారు.. ఆయన తలను నరికి అక్కడి నుంచి పారిపోయారు. ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. కొందరు స్థానికులు గమనించి వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సంజన్న చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.
సంజన్న మరణ వార్త తెలియడంతో టీడీపీ కార్యకర్తలు భారీగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వచ్చారు. ఆ కోపంలో సంజన్న వడ్డే రామాంజనేయులు వాహనంపైన రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కనిపించగా.. పోలీసులు కాలనీకి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వడ్డె రామాంజనేయులతో పాటుగా ఆయన కుమారులు మరికొందరు ఘటనలో పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణతో తెలిసింది. కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు ఈ హత్య ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొన్నేళ్లుగా రౌడీషీటర్ వడ్డె రామాంజనేయులు, సంజన్న మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని.. ఈ క్రమంలోనే సంజన్న హత్యకు ఒడిగట్టి ఉంటారంటున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంజన్న కుటుంబాన్ని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. మంచి నేతను కోల్పోయామని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 'కక్షలకు, వర్గపోరుకు కుటుంబాలు బలి కాకూడదని.. సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం. నా కుటుంబ సభ్యుడిని నేను కోల్పోయాను. సంజన్న కుటుంబానికి నేను అండగా ఉంటా. ఈ హత్య వెనుక ఉన్న వారిని ఎవరినీ వదలపెట్టను. హత్య చేసిన వారికి టీడీపీకి సంబంధం లేదు. ఇద్దరి మధ్య గొడవ ఉన్నా హత్యలు చేసుకోవడం తగదు. ఖచ్చితంగా అందరికీ శిక్ష పడుతుంది. ఇది ప్రీప్లాన్డ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూస్తాం. హంతకులు ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి ఓటు వేయాలని కత్తులు, కొడవల్లతో బెదిరిస్తూ తిరిగారు’ అన్నారు బైరెడ్డి శబరి.
![]() |
![]() |