ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంట్లో అక్కడ కూడా గోల్డ్ దాచిపెట్టి.... రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 10:42 PM

బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒంటిలో ప్రతిచోట బంగారం దాచిపెట్టి తీసుకొస్తుందని బిజపుర సిటీ ఎమ్మెల్యే బసన్‌గౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రెండు వారాల కిందట దుబాయ్ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారం తీసుకొస్తూ.. బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.


తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ మాట్లాడుతూ.. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఏఏ మంత్రులు ఉన్నారో తనకు తెలుసని ఆయన ఆరోపించారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారందరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే కోరారు. అలాగే, రన్యా రావు సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఎవరినైనా సమర్థించవచ్చా? అని వ్యాఖ్యానించారు. కాగా, తన సవతి కుమార్తె దందాతో తనకు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం.. ఆయనను తప్పనిసరి సెలవుపై పంపింది.


‘కస్టమ్స్ అధికారుల వైఫల్యం కూడా ఉందని, వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలి.. ఆమె (రన్యా రావు) తన ఒంట్లో ప్రతిచోట ఎక్కడపడితే అక్కడే బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుంది... ఈ వ్వవహారంలో ఉన్న మంత్రుల పేర్లన్నీ తనకు తెలుసు.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వారి బండారం బయటపెడతాను.. బంగారం ఆమె ఎలా తీసుకొచ్చిందీ.. సెక్యూరిటీ క్లియరెన్స్‌కు ఎవరు సాయం చేశారు.. ఎవరితో సంబంధాలు ఉన్నాయి.. ఆమె ఒంట్లో ఏ చోట దాచిపెట్టిందో అనేది పూర్తి సమాచారం నా దగ్గర ఉంది... అసెంబ్లీలో అవన్నీ చెబుతా’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


అయితే, బీజేపీ ఎమ్మెల్యే పాటిల్‌కు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేం కాదు. గతంలో 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని విషకన్య అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయనకు ఈసీ నోటీసులు కూడా జారీచేసింది. అంతేకాదు, 2020లో ముస్లిం మైనార్టీ కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు కోసం ఉద్దేశించిన పథకాన్ని రద్దుచేయడాన్ని సమర్దించిన యత్నాల్.. ఈ పథకం కోరుకుంటున్నవారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడ్ని పాకిస్థాన్ ఏజెంట్ అంటూ నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa