కాకినాడలో ఓఎన్‌జీసీ ఉద్యోగి చంద్రకిషోర్ ఇద్దరు కుమారుల్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చంద్రకిషోర్ చాలా ధైర్యవంతుడని, పిల్లలంటే ఎంతో ప్రేమని బంధువులు, సన్నిహితులు అంటున్నారు. ఆయన గతంలో తమకు ధైర్యం చెప్పారని.. అలాంటి వ్యక్తి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నారు.. ఇలా చేయడానికి కారణం ఏంటనేది మిస్టరీగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, సీఐ పెద్దిరాజులు వివరాలను వెల్లడించారు.
ఈ కేసులో సంఘటనా స్థలంలో తమకు సూసైడ్ నోట్ దొరికిందని.. అది చంద్రకిషోర్ రాసినట్లు నిర్ధారించుకున్నామని తెలిపారు. ఆ లేఖలో ' నా పిల్లలు సరిగా చదవట్లేదు.. ఈ పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవకపోతే జీవితంలో స్థిరపడలేరు, కష్టాలొస్తాయి, వాటిని నేను చూడలేననే భావనతో మానసికంగా కుంగిపోయాను. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. నా భార్య చాలా మంచిది' అని రాసినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో వేరే కోణాలు కనిపించలేదని.. తల్లిదండ్రులంతా ఈ కేసును ఉదాహరణగా తీసుకుని తమ పిల్లల చదువు విషయంలో ఒత్తిడి చేయొద్దని పోలీసులు సూచించారు. పిల్లల భవిష్యత్తుపై చిన్నతనంలోనే ఒక నిర్ధారణకు రాకూడదు అన్నారు.
ఇటీవల చంద్రకిషోర్ ఇద్దరు కుమారుల్ని రూ.లక్షన్నర ఫీజు చెల్లించి చదివించలేమనే ఉద్దేశంతో స్కూల్ మార్చేసినట్లు చెబుతున్నారు. వారిని ఇటీవలే రూ.50 వేలు ఫీజున్న స్కూలుకు మార్చారని.. ఆ విషయాన్ని చంద్రకిషోర్ తట్టుకోలేకపోయారంటున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఒకటో తరగతి, మరొకరు ఒకటో తరగతి చదువుతున్నారు. వానపల్లి చంద్రశేఖర్‌ది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాగా.. ఓఎన్జీసీలో ఉద్యోగి. కాకినాడ రూరల్ తోట సుబ్బారావునగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 14న చంద్రకిషోర్ తన పిల్లలిద్దరినీ చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భర్త, ఇద్దరు పిల్లల మరణంతో భార్య తీవ్ర విషాదంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, మంచి జీతం, సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఇంతలో ఇలా జరగడం విషాదాన్ని నింపింది.
![]() |
![]() |